
ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్.. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.
మోదీ అబద్ధాలు మాట్లాడుతున్నారని, భావోద్వేగంతో దోపిడీ చేస్తారని ప్రజలు గ్రహించారని అన్నారు. తనను సజీవంగా సమాధి చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. ఆయనను సజీవంగా సమాధి చేయాలని ఎందుకు అనుకుంటారు. బదులుగా, మోదీ చేస్తున్న రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
గత 10 ఏళ్లుగా ఆయన (మోదీ) ప్రధానిగా ఉన్నారు. పేదల కోసం చేసిందేమీ లేదు . దానికి తోడు ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో ఆయన అబద్ధాల మాస్టర్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రధానిని ఓడించడం తప్ప, సజీవ సమాధి చేయాలని ఎవరూ కోరుకోవడం లేదని అన్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని నందుర్‌బార్‌లో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న కొందరు తనను సజీవ సమాధి చేయాలని చూస్తున్నారని, దేశ ప్రజలే తనకు రక్షణ కవచమని, వారు తనకు ఎలాంటి హాని జరగనివ్వబోరని పేర్కొన్నారు.
ఆ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రధాని నిరాశలో, ఓటమి భయంతో ఉన్నారు. భయం, నిస్పృహతో ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ అబ్ధాలు, భావోద్వేగంతో మాట్లాడుతున్నారని ప్రజలకు అర్థమైందని ..తమను మానసికంగా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలకు తెలుసునని, ఈ విషయం తెలిసి ప్రజలు ఓట్లు వేయరని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పైకి వెళ్లిన వారు కిందకు దిగి రావాల్సిందేనన్నారు.