రాజ్యాంగాన్ని మార్చే కుట్ర | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

Published Sun, Apr 28 2024 4:12 AM

CM Revanth Reddy Fires On BJP

ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌

2025 నాటికి దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం 

రిజర్వేషన్లను మొత్తంగా ఎత్తి వేయాలనేది వారి సిద్ధాంతం 

అదే జరిగితే కార్పొరేట్ల ముందు దళితులు, గిరిజనులు, ఓబీసీలు కట్టు బానిసలే.. 

ఆ దిశగానే ప్రధాని మోదీ, అమిత్‌ షా విచక్షణా రహిత వ్యాఖ్యలు 

కాంగ్రెస్‌ గెలిస్తే పుస్తెలు అమ్మేస్తారంటూ దిగజారి మాట్లాడుతున్నారు 

కేసీఆర్‌ బీజేపీతో కుమ్మక్కయ్యారు.. ఐదు ఎంపీ సీట్లను తాకట్టు పెట్టారు 

దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ పార్టీ గెలవాలని వ్యాఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: అంబేడ్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి.. రిజర్వేషన్లు లేని దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుట్రలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను కార్పొరేట్‌ శక్తులతో కలసి అమలు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌పై మోదీ, అమిత్‌ షా విష ప్ర చారం చేస్తున్నారని.. పుస్తెలు అమ్మేస్తారంటూ విచక్షణారహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బస్సుయాత్రలో కేసీఆర్‌ చేస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ.. ‘‘కేసీఆర్‌కు ఇంత అసహనం ఎందుకు? అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా?’’అని మండిపడ్డారు. శనివారం రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్‌. ఓబీసీ రిజర్వేషన్లపై 1978లోనే బీపీ మండల్‌ కమిషన్‌ వేసింది. 1990లో వీపీ సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుకు శ్రీకారం చుట్టింది. కమిషన్‌ బీసీలకు 27శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని సూచిస్తే.. ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల వర్గాలు దానిని వ్యతిరేకించాయి. సుప్రీంకోర్టు మండల్‌ కమిషన్‌ నివేదికను సమర్ధించి, రిజర్వేషన్లను 50శాతానికి మించకుండా అమలు చేయాలని సూచించింది. తదనుగుణంగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాందీకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. కులగణన ద్వారా 50 శాతం రిజర్వేషన్ల విధానానికి స్వస్తి పలికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచవచ్చు. కానీ దీనికి భిన్నంగా దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దేశ మూల వాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. దేశంలో రిజర్వేషన్లు అమలు కావాలంటే కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రావాలి. 

ప్రధాని హోదాలో ఉండి అలాంటి వ్యాఖ్యలా? 
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల మెడలోని పుస్తెలు అమ్మేస్తుందంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విచక్షణా రహితంగా, దిగజారి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఎవరి కష్టార్జితం వాళ్లదే.. ఎవరి సంపాదన వారిదే. భార్య ఆస్తిని కూడా అనుమతి లేకుండా భర్త తీసుకోవడానికి హక్కు లేదని న్యాయస్థానాలు చెప్తున్నాయి. కానీ బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించే వికృత రాజకీయ క్రీడకు తెర లేపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తోంది. దేశాన్ని రిజర్వేషన్‌ రహితంగా మార్చేందుకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లెక్కన 400 ఎంపీ సీట్లు కోరుకుంటోంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించిన 1925లోనే దేశాన్ని వందేళ్లలో హిందూ రాజ్యంగా మార్చాలని ప్రతిజ్ఞ చేశారు. దానిని 2025 నాటికి అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే రిజర్వేషన్లను రద్దు చేసి, కులాలతో సంబంధం లేకుండా హిందూ సమాజాన్ని ఒకటిగా చూపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళికలు వేసింది. దాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ట్రిపుల్‌ తలాక్, 370 ఆర్టికల్, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్, సిటిజన్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌.. ఇలా కొన్ని నెలలుగా ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆనాటి ఈస్టిండియా కంపెనీలా బీజేపీ వ్యవహరిస్తోంది. 

రిజర్వేషన్లను రద్దు చేయబోమని బీజేపీ వాళ్లు ఎందుకు అనట్లేదు? 
ఇన్ని ఆరోపణలు వస్తున్నా.. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోమని మోదీ, అమిత్‌ షా ఎప్పుడూ, ఎక్కడా చెప్పడం లేదెందుకు? ఇక్కడ బండి సంజయ్, కిషన్‌రెడ్డి మాత్రమే కాదు.. లెఫ్ట్‌ భావజాలం అని చెప్పుకొనే ఈటెల రాజేందర్‌ కూడా దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? బీజేపీ విధానమేంటో వారికి స్పష్టంగా తెలుసు కాబట్టే మాట్లాడటం లేదు. దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ గెలవాలి..’’అని రేవంత్‌ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్, పార్టీ నేతలు బెల్లయ్య నాయక్, సామా రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
కేసీఆర్, బీజేపీతో ఒప్పందంలో భాగంగానే.. 
‘‘అమెరికా నుంచి అమలాపురం వరకు, చంద్ర మండలం నుంచి చింతమడక వరకు అన్నీ మాట్లాడే కేసీఆర్‌.. బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడటం లేదేం? గతంలో కేసీఆర్‌ కూడా రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమే. వంద రోజుల మా ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ బస్సుయాత్ర చేస్తున్న కేసీఆర్‌.. రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోదీపై కార్యాచరణ చేపట్టడం లేదేం? మీ టార్గెట్‌ వంద రోజుల మా ప్రభుత్వమా? పదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న మోదీయా చెప్పాలి. రిజర్వేషన్లను రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్‌ఎస్‌ వైఖరేంటో కేసీఆర్‌ చెప్పాలి. 

బిడ్డ బెయిల్‌ కోసం కేసీఆర్‌ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఐదు ఎంపీ స్థానాలను బీజేపీకి తాకట్టు పెట్టింది. మల్కాజిగిరి ఎంపీ సీట్లో బీజేపీ గెలుస్తుందని మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం. బీజేపీ గెలుస్తుందని బహిరంగంగా చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్‌ సమర్ధించడం దేనికి సూచన? బీఆర్‌ఎస్‌కు నిజంగా బీజేపీతో వైరముంటే మల్లారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్‌ చేయాలి. అమాయకంగానో, అత్యుత్సాహంతోనో మేడ్చల్‌ ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టారు. ఇక కేసీఆర్, కేటీఆర్‌ల గుండు పగలగొట్టడమే మిగిలింది. 

ఈటల అప్పుడు మాట్లాడలేదేం? 
గతంలో మల్కాజిగిరి ఎంపీగా నన్ను ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్‌.. ఈసారి ఎన్నికల్లో ఇప్పటివరకు ఒకే ఒక్క సమావేశం పెట్టారు. ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేటీఆర్‌ గానీ.. కేసీఆర్, కేటీఆర్‌లకు వ్యతిరేకంగా ఈటల గానీ మాట్లాడటం లేదు. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని నాపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ భూములు అమ్మినప్పుడు ఈటల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా? అప్పుడు భూములు అమ్మవద్దని గుర్తుకురాలేదా?’’   

Advertisement
Advertisement