సాక్షి, కాకినాడ జిల్లా: సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కూటమి మోసాలను ఎండగట్టారు. ఇంటింటి అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీని గెలిపించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే..
‘‘చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇదే. చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే. కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నాం. గతంలో ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను కూటమి నేతలు చెత్తబుట్టలో వేశారు’’ అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా..
‘‘2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశాం. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం. జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచాం’’ అని సీఎం పేర్కొన్నారు.
మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే
‘‘స్వయం ఉపాధికి గతంలో ఈ పథకాలు ఉన్నాయా?. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. మన మేనిఫెస్టోను నేరుగా ఇళ్లకే పంపి ఆశీస్సులు తీసుకున్నాం. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే’’ అని సీఎం చెప్పారు.
మీ ఇద్దరినీ అడుగుతున్నా..
‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరి వెళ్లి భూములు కొన్నాడు.. బాలకృష్ణ మొన్ననే విశాఖలో రిషికొండలో భూమలు కొన్నాడు.. మీ ఇద్దరినీ అడుగుతున్నా.. మీకు ఒరిజినల్ డీడ్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇచ్చారా?. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డీడ్స్ ఇచ్చాం’’ అని సీఎం జగన్ వివరించారు.
దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?
‘‘వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న దత్తపుత్రుడికి ఓటు వేయకండి.. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా?. గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు. దత్తపుత్రుడిని మహిళలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఐదేళ్లకోసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు’’ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment