Mother's Day 2024: బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ‘అమ్మ’ | Mothers Day 2024: Here's The List Of 9 Best Mother Sentiment Movies In Tollywood, More Info Inside | Sakshi
Sakshi News home page

Mother’s Day 2024: మదర్‌ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలివే!

Published Sun, May 12 2024 1:46 PM | Last Updated on Sun, May 12 2024 6:13 PM

Mothers Day 2024: List Of Best Mother Sentiment Movies In Tollywood

నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో  అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా..విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో  ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్‌ సినిమాలపై లుక్కేద్దాం.

గుంటూరు కారం(2024)
మహేశ్‌బాబు , త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కినదే. ఇందులో మహేశ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ  సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ- మహేశ్‌బాబు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.

ఒకే ఒక జీవితం(2022)
శర్వానంద్‌  హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్‌ హీరోయిన్‌ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్‌ సెంటిమెంట్‌ని యాడ్‌ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్‌.  20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గ‌తంలో చేసిన త‌ప్పుల్ని స‌వ‌రించుకునే చాన్స్‌ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిష‌న్ క‌థ‌ని అమ్మ ఎమోష‌న్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.

'బిచ్చగాడు'
తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)
2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

అమ్మ చెప్పింది
2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. 

 ప్రభాస్ 'ఛత్రపతి'(2005)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్‌ పాత్ర పోషించింగి.

యోగి: 
ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో  'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)
2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్‌ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

నిజం
కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ  సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్‌ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. 
వీటితో పాటు 

అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్‌, చిరుత, అమ్మ రాజీనామా, సింహరాశి, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్‌ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement