మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు! | Sakshi
Sakshi News home page

మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!

Published Thu, Nov 23 2023 6:54 AM

Ancient Humans may have Worn shoes as Early as the Middle Stone Age - Sakshi

నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు?  ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది.

మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్‌ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి  ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది.



ఈస్ట్ హార్ట్‌ఫోర్డ్‌లోని గుడ్‌విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్‌ అంటే బూట్లు ఒకటని తెలిపారు.  ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్‌ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్‌ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్‌ భావించారు. 

మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల  సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్‌లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి.  

విట్‌వాటర్‌రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్‌హార్డ్ జిప్‌ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్‌లో  పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు.

అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదర‍క్షల గురించి తెలుసుకునే ‍ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్‌ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం  ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే  పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. 

నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement