వారెవ్వా! కార్బన్‌డయాక్సైడ్‌తో పిండిపదార్థం.. | Sakshi
Sakshi News home page

కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చగలిగితే?

Published Wed, Sep 29 2021 7:42 AM

Carbon Dioxide Converted Into A Carbohydrate Ready For Reuse - Sakshi

బ్రెడ్డు ముక్క మొదలు.. కాగితం ముక్క వరకూ దేనినైనా పిండిపదార్థం లేకుండా తయారు చేయడం అసాధ్యం. పిండి పదార్థం తయారీకి బోలెడంత నీరు, భూమి అవసరం. కానీ, ఇవేవీ లేకుండా.. కేవలం కాలుష్య కారక కార్బన్‌డయాక్సైడ్‌ అనే వాయువునే పిండిపదార్థంగా మార్చగలిగితే? చైనా శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయి. ఈ ప్రక్రియలో దాదాపు 60 వరకూ జీవరసాయనిక చర్యలు జరుగుతుంటాయి. ఇంతకంటే సులువుగా పిండిపదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉన్న మార్గాలపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగప్రక్రియ కంటే ఎన్నోరెట్లు వేగంగా కృత్రిమ పద్ధతుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చడంలో విజయం సాధించారు.

సేంద్రియ ఉత్ప్రేరకం సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను మెథనాల్‌గా, ఆ తరువాత కృత్రిమ ఎంజైమ్‌ల సాయంతో చక్కెరలుగా మార్చడం, వీటి నుంచి పిండిపదార్థం తయారు చేయడం ఈ ప్రక్రియ సారాంశం. మొక్కజొన్న కంటే 8.5 రెట్లు ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేయగలగడం కొత్త పద్ధతి ప్రత్యేకత. పిండిపదార్థాన్ని ఇలా కొత్తపద్ధతిలో తయారు చేసుకుంటే పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్న కీటకనాశినులు, ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, పిండిపదార్థం కోసం ఉపయోగిస్తున్న పంటభూమిని కూడా ఇతర అవసరాలకు వాడవచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త చీ టావో తెలిపారు.  
చదవండి: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు!

Advertisement
Advertisement