‘సత్య’ మూవీ రివ్యూ | Satya Movie Review And Rating In Telugu | Hamaresh | Prardhana Sandeep | Sakshi
Sakshi News home page

Satya Movie Review : ‘సత్య’ మూవీ రివ్యూ

Published Fri, May 10 2024 8:03 AM

Satya Movie Review And Rating In Telugu

టైటిల్‌: సత్య
నటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ
రచన-దర్శకత్వం: వాలీ మోహన్‌దాస్‌
నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)
సంగీతం: సుందరమూర్తి కె.యస్‌
సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగం
ఎడిటర్‌: ఆర్‌. సత్యనారాయణ
విడుదల తేది: మే 10, 2024(తెలుగులో)

ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్‌ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్‌ చేసి హిట్‌ టాక్‌ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్‌ సినిమానే సత్య. తమిళ్‌లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్‌, శివమ్‌ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్‌ సినిమా మాదిరి ప్రమోషన్స్‌ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

‘సత్య’ కథేంటంటే..
సత్యమూర్తి అలియాస్‌ సత్య(హమరేష్‌) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్‌) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్‌ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్‌ కాలేజీలో జాయిన్‌ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.

తండ్రి కోసమే ప్రైవేట్‌ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్‌ పారు(ప్రార్ధన సందీప్‌)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. 

అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్‌ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్‌ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
స్కూల్‌, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్‌ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్‌ని యాడ్‌ చేసి ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్‌లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు.  కొడుకు కోసం పేరెంట్స్‌.. పెరెంట్స్‌ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.

ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు  కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్‌ అవుతారు. 

తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్‌ రూపంలో చెప్పకుండా..విజువల్స్‌ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్‌ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్‌ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్‌లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. 

ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌.. కార్పొరేట్‌ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్‌ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. 

కాలేజీలో జరిగే  చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్‌ సీన్స్‌ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్‌  ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్‌ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. 

ఎవరెలా చేశారంటే..
సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు.  భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.

పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. 

హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది.  సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  డబ్బింగ్‌ విషయంలో  చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా  చూసినట్లే ఉంటుంది.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement