టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటి తమకంటే చాలా రెట్లు మెరుగైన న్యూజిలాండ్‌ను ఖంగుతినిపించారు. తొలుత బ్యాటింగ్‌లో చెలరేగిన ఆఫ్ఘన్ ప్లేయర్లు.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి కివీస్‌కు ఊహించని షాకిచ్చారు.
ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి పటిష్టమైన న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కివీస్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది. న్యూజిలాండ్‌ను ఈ స్థితికి దిగజార్చడానికి ముఖ్య కారకుడు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్. ఈ మ్యాచ్‌లో రషీద్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు.
రషీద్‌తో పాటు ఫజల్ హక్ ఫారూఖీ (3.2-0-17-4), మొహమ్మద్ నబీ (4-0-16-2) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. రషీద్, ఫజల్ హక్, నబీల దెబ్బకు 15.2 ఓవర్లలో 75 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (18), మ్యాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
వీరిద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే టపా కట్టేసి ఉంటే న్యూజిలాండ్ 50 పరుగుల మార్కు కూడా దాటేది కాదు. దీనికి ముందు రహ్మానుల్లా గుర్బాజ్ (80), ఇబ్రహీం జద్రాన్ (44) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, జద్రాన్‌తో పాటు అజ్మతుల్లా (22) రాణించాడు.
కివీస్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ తలో 2 వికెట్లు తీయగా.. ఫెర్గూసన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆఫ్ఘన్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో కలిసికట్టుగా రాణించి కివీస్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడటం ఇదే తొలిసారి.
రషీద్ ఈజ్ ద బెస్ట్..
ఈ మ్యాచ్‌లో అద్భుత గణాంకాలు నమోదు చేసి కివీస్ పతనాన్ని శాశించిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ప్రపంచకప్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4-0-17-4) నమోదు చేసిన కెప్టెన్‌గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. రషీద్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ పేరిట ఉండేది. వెటోరీ 2007 వరల్డ్‌కప్‌లో ఇండియాపై 4 ఓవరల్లో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఈ జాబితాలో రషీద్, వెటోరీ తర్వాత ఒమన్ బౌలర్ జీషన్ మక్సూద్ (2021లో పపువా న్యూ గినియాపై 4-0-20-4), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (2012లో శ్రీలంకపై 4-0-24-3) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment