కేంద్రం ఆఫర్‌.. ఇక రైతు సంఘాలదే నిర్ణయం | Sakshi
Sakshi News home page

రైతుల నిరసనలు: కేంద్రం ఆఫర్‌.. ఇక రైతు సంఘాలదే నిర్ణయం

Published Mon, Feb 19 2024 7:38 AM

Farmers Protest 2024: Centre Offer Farmers AT 4th Round Of Meeting - Sakshi

ఢిల్లీ, సాక్షి: పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు(8, 12, 15 తేదీల్లో) రైతు సంఘాలతో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. 

ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. 

‘‘.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రతిపాదించింది. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి.. 

.. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. మా ప్రతిపాదనలతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయి’’ అని మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. ‘‘కేంద్రాన్ని.. పప్పు ధాన్యాలపై కనీస మద్ధతు ధర హామీ అడిగామ’’ని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ మీడియాకు తెలిపారు. 

ఇక.. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ స్పందించారు. సోమ, మంగళవారాల్లో తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే..

కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ డిమాండ్‌ చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం చర్చలు చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధతకు ఒక ఆర్డినెన్స్‌, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలుకు ఒక నోటిఫికేషన్‌ ఇవ్వడం ద్వారా కేంద్రం పరిష్కారం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు నెరవేర్చే వరకు రైతులు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

21న నల్ల జెండాలతో ఘెరావ్‌
గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది.

ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగింపు
రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లో పటియాలా, సంగ్రూర్‌, ఫతేగఢ్‌ సాహిబ్‌ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ సేవల రద్దును 24 వరకు పొడిగించారు.

Advertisement
 
Advertisement