Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా! | Hyderabad Woman Protest For Better Roads By Sitting In Pothole Viral, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నాగోలు వైరల్‌: మండదా అన్నా.. మండదా అక్కా!

May 24 2024 7:33 AM | Updated on May 24 2024 10:58 AM

Hyderabad Woman Protest In Pothole Viral

రేడియల్‌ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు సంబంధిత అధికారులకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’ ద్వారా విజ్ఞప్తి చేసింది.

నాగోలు రోడ్డుపై గుంతతో తరచూ ప్రమాదాలు

బురదలో కూర్చుని మహిళ నిరసన   

స్పందించిన అధికారులు

ఎన్నికల కోడ్‌ ముగిశాక రిపేర్‌ చేయిస్తామని హామీ

నాగోలు: అక్కడ రోడ్డు గుంతలమయంగా మారింది.  నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవం లేదు. ఇదే రూట్‌లో ఓ మహిళ రెండుసార్లు యాక్సిడెంట్‌కు గురైంది. అంతే.. ఆమెకు మండింది. బురద గుంతలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. సమస్యకు పరిష్కారం చూపాలని ప్లకార్డులు ప్రదర్శించింది. ఇంకేం.. అటుగా పోయేవాళ్లు స్మార్ట్‌ఫోన్లతో అదంతా ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆమె వైరల్‌ అయ్యింది.  

వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌ పరిధిలోని న్యూ జీవీఆర్‌ కాలనీకి చెందిన నిహారిక ప్రైవేట్‌ ఉద్యోగి. అమె ఇద్దరు పిల్లలు బండ్లగూడ  పరిధిలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రతి రోజూ ఆమె వారిని బైక్‌పై  పాఠశాలకు తీసుకెళ్తుంది.  నాగోలు బండ్లగూడ రేడియల్‌ రోడ్డు కొంతకాలంగా గుంతలమయంగా మారడంతో  ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల  బారిన పడుతున్నారు. నిహారిక కూడా గతంలో ఇదే రోడ్డుపై అదుపుతప్పి కింద పడింది. దీంతో రేడియల్‌ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో పాటు సంబంధిత అధికారులకు సోషల్‌ మీడియా వేదిక ‘ఎక్స్‌’ ద్వారా విజ్ఞప్తి చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. 

ఇదిలా ఉండగా గురువారం ఆమె స్యూటీపై నాగోలు వైపు వెళ్తుండగా బైక్‌ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడింది.  స్వల్ప గాయాలు కావడంతో పిల్లలను ఇంటి వద్ద వదిలి ఘటనా స్థలానికి తిరిగి వచ్చి ఆమె రోడ్ల దుస్థితిపై ఏడాదిగా మేయర్, అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ బురదలో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది.  

దీంతో ట్రాఫిక్‌ పోలీసులు అమె నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపింది. నాగోలు కార్పొరేటర్‌ భర్త చింతల సురేందర్‌ యాదవ్, నాగోలు పోలీసులు అక్కడికి వచ్చి రోడ్ల మరమ్మతుకు నిధులు మంజారుయ్యాయని ఎన్నికల కోడ్‌ కారణంగా పనులు చేపట్టలేదని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించగా, ఎన్నికల కోడ్‌ ఎత్తివేయగానే మరమ్మతు పనులు చేపడతామని  హామీ ఇచ్చారు.  ముందుస్తుగా గుంతలను మట్టితో పూడ్చి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో నిహారిక  నిరసన విరమించింది.  

కోడ్‌ ముగియగానే పనులు చేపడతాం 
నాగోలు–ఆనంద్‌నగర్‌ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 4 కోట్లు నిధులు మంజురయ్యాయి. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల కోడ్‌ ముగియగానే  పనులు చేపడతాం.  
:::డాక్టర్‌ తిప్పర్తి యాదయ్య,  హయత్‌నగర్‌ సర్కిల్‌ డీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement