మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి
అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడి
రిగ్గింగ్ అడ్డుకోవడంతో తుమృకోటలో నాలుగు ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
అయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు
పోలింగ్ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలు
అయినా రీపోలింగ్ కోరని టీడీపీ
అంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..
మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్ కోరిన ఎమ్మెల్యే పిన్నెల్లి
రీపోలింగ్ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.
ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.
విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..
నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.
అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..
ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.
అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.
రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..
మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.
టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్‌సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్‌కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment