‘ఆప్‌’- కాంగ్రెస్‌ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా? | Sakshi
Sakshi News home page

‘ఆప్‌’- కాంగ్రెస్‌ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?

Published Thu, May 2 2024 8:45 AM

Mayawati Fields Candidates on All Seven Seats of Delhi

దేశంలో ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే కనిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు జతకట్టి ఎన్నికల బరిలో దిగాయి. అయితే కాంగ్రెస్‌ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా తర్వాత, ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. ఇంతలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశ రాజధానిలోని ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టారు.

మీడియా నివేదికల ప్రకారం రాజధాని ఢిల్లీలో దాదాపు 20 శాతం ఎస్సీ ఓటర్లున్నారు. దీనితో పాటు యూపీకి చెందిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీఎస్పీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మే 25న ఆరో దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షురాలు మాయావతి మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిసార్లు కాంగ్రెస్, కొన్నిసార్లు బీజేపీ మమ్మల్ని ఉపయోగించుకున్నాయి. ఆ పార్టీలు మమ్మల్ని ‘బి’ టీమ్ అని పిలిచాయి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏది బీ టీమ్ అనేదో తేలిపోనున్నదన్నారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి  తమ పార్టీ తరపున  ఢిల్లీలోని చాందినీ చౌక్‌ నుంచి అడ్వకేట్ అబ్దుల్ కలాం, దక్షిణ ఢిల్లీ నుంచి అబ్దుల్ బాసిత్, తూర్పు ఢిల్లీ నుండి న్యాయవాది రాజన్ పాల్‌ను ఎన్నికల బరిలోకి దించింది. అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి డాక్టర్ అశోక్ కుమార్ మైదాన్, న్యూఢిల్లీ నుంచి న్యాయవాది సత్యప్రకాశ్ గౌతమ్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి విజయ్ బౌధ్, పశ్చిమ ఢిల్లీ నుంచి విశాఖ ఆనంద్‌లకు టికెట్ ఇచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్‌పీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 250 స్థానాలు, ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటుంది. 2008లో ఢిల్లీలో బీఎస్పీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2009, 2014, 2019 సంవత్సరాల్లోనూ బీఎస్‌పీ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే ఎప్పుడూ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అయితే ఇప్పడు ఢిల్లీలో మారిన రాజకీయ సమీకరణలు తమకు కలిసివస్తాయని మాయావతి భావిస్తున్నారని సమాచారం.

Advertisement
Advertisement