అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం! | Sakshi
Sakshi News home page

Lucknow: అయోధ్యకు చేరువలో పాదయాత్రికురాలు షబ్నం!

Published Sun, Jan 28 2024 1:24 PM

Shabnam Welcomed in Baldiray in Sultanpur - Sakshi

మతపరమైన ఆంక్షలన్నింటినీ దాటుకుని ముంబై నుంచి శ్రీరాముని దర్శనానికి కాలినడకన బయలుదేరిన షబ్నం ఇప్పుడు అయోధ్యకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. ఆమె హలియాపూర్‌లోని అయోధ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది తన కల నిజమవుతున్న తరుణమని అన్నారు. కొద్దిసేపటిలో రామ్‌లల్లా దర్శనం చేసుకోబోతున్నానన్నారు. షబ్నం షేక్‌కు హాలియాపూర్‌లో  స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది.

ముంబైలో ఉంటున్న షబ్నమ్ షేక్ (23) బీకామ్ విద్యార్థిని. రామునిపై ఆమెకు ఉన్న భక్తిప్రపత్తులను ఆమె సోషల్ మీడియాలో వెల్లడిస్తుంటారు. 38 రోజుల క్రితం ఆమె తన ముగ్గురు హిందూ స్నేహితులైన రమణ్ రాజ్ శర్మ, వినీత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి అయోధ్యకు కాలినడకన బయలుదేరారు. శనివారం సాయంత్రం హాలియాపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర స్థానికులు వారికి స్వాగతం పలికారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.

ప్రతాప్ ధాబా నిర్వాహకుడు హరి ప్రతాప్ సింగ్, అతని భార్య ప్రీతి సింగ్ షబ్నం బృందానికి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని వారు కోరారు. షబ్నం వారి అభ్యర్థనను అంగీకరించారు. 

ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలినని, అయోధ్యకు సమీపానికి చేరుకోవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను రెండు రోజుల పాటు అయోధ్యలో ఉండి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకుని, ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకుంటానన్నారు.
 

Advertisement
Advertisement