అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్‌డీఏ వైపు పల్లవి పటేల్‌ | Sakshi
Sakshi News home page

అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్‌డీఏ వైపు పల్లవి పటేల్‌

Published Fri, Mar 22 2024 3:38 PM

Apna Dal K Pallavi Patel hints at joining NDA in UP - Sakshi

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే  పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్‌లో ‘ఇండియా’ కూటమికి  నితీష్ కుమార్‌ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్‌డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. 

మరోవైపు  అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.

పల్లవి పటేల్‌ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్‌ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.

Advertisement
Advertisement