మహిళ, మరో ఇద్దరిపై దాడి
నరసాపురం ఆస్పత్రిలో బాధితులకు చికిత్స
నరసాపురం: ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే నరసాపురంలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో ఆటోలో వెళుతున్న ఓ కుటుంబంపై జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో దాడి చేశాడు. ఓ మహిళను, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కడలి శ్రీనివాస్ ఇంటికి ఆచంట వేమవరానికి చెందిన బొక్కా శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి మరికొందరు బంధువులు వచ్చారు. వీరంతా కలిసి ఆటోలో పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు.
అదే ఆటోలో తిరిగి వస్తుండగా తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన జనసేన చోటా నాయకుడు బళ్ల బాబి, అతడి స్నేహితులు మరో ముగ్గురు కారులో వస్తున్నారు. కారుకు ఆటో సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఆటోను వెంబడించి కేపీపాలెం గ్రామం వద్ద ఆపారు. అసలు విషయం పక్కన పెట్టిన అసలు మీరు ఎవరు? మొన్న ఎన్నికల్లో జనసేనకు ఓటు వేశారా? వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారా అంటూ బాబి వారిని నిలదీశాడు. మీరు బీసీల్లా ఉన్నారు.. మీరు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి ఉంటారంటూ వారిపై బాబి, అతడి స్నేహితులు దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు.
దీంతో లక్ష్మితో పాటు బొక్కా శ్రీనివాస్, కడలి శ్రీనుకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ జి.శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే కేసులో పోలీసులు జనసేన నేత బళ్ల బాబీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల బంధువులు ఆందోళన చేశారు. బాబీని కొంతసేపు ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచిన పోలీసులు అతడిని రూరల్ స్టేషన్‌కు తరలించారని, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment