బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు  | Sakshi
Sakshi News home page

బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు 

Published Sun, Oct 1 2023 2:54 AM

Mallikarjuna Kharge: BCs donot need to worry about seats in assembly elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్‌ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు.

సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement