రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్త‌లో పడేసిందంటూ: య‌శ్ తండ్రి | Yash Dayals father recalls trolling after sons sweet redemption | Sakshi
Sakshi News home page

రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్త‌లో పడేసిందంటూ: య‌శ్ తండ్రి

Published Mon, May 20 2024 3:55 PM | Last Updated on Mon, May 20 2024 4:07 PM

Yash Dayals father recalls trolling after sons sweet redemption


ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావ‌డంలో ఆ జట్టు పేస‌ర్ యష్ దయాల్‌ది కీల‌క పాత్ర‌. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో ద‌యాల్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

గ‌తేడాది సీజ‌న్‌లో గుజ‌రాత్ త‌ర‌పున జీరోగా మారిన ద‌యాల్ ఇప్పుడు ఆర్సీబీ త‌ర‌పున హీరోగా మారాడు. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆఖరి ఓవర్‌లో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఆఖ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను య‌శ్ ద‌యాల్‌కు ఇచ్చాడు. 

క్రీజులో ఎంఎస్ ధోని, ర‌వీంద్ర జ‌డేజా వంటి డెంజ‌రస్ ఆట‌గాళ్లు ఉండ‌డంతో సీఎస్‌కే విజ‌యం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ అంద‌ర‌ని అంచ‌నాల‌ను ద‌యాల్ తారుమారు చేశాడు.  తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మొత్తం ఏడు పరుగులే ఇచ్చి త‌న జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో ద‌యాల్ సంచలన ప్రదర్శనతో అతని తండ్రి చంద్రపాల్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. తన కొడుకును ఆర్సీబీ రూ.5 కోట్ల‌కు కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారని చంద్రపాల్ చెప్పుకొచ్చాడు.

'నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఓ వ్యక్తి యష్‌ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్‌ను షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ  హేళ‌న చేసేలా ఆ మీమ్ ఉంది. అది నాకు ఇప్ప‌టికి బాగా గుర్తు ఉంది. ఆ మీమ్‌లో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ప్రారంభం కాకముందే ముగిసింది'అని రాసుకొచ్చారు. 

ఆ ఆన్‌లైన్ ట్రోలింగ్ అంతటితో అగిపోలేదు. మేము ఆ ట్రోలింగ్ చూడ‌లేక  మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో నుంచి నిష్క్రమించాం. ఈ ఏడాది సీజ‌న్ వేలంలో ఆర్సీబీ  రూ. 5 కోట్లకు య‌శ్‌ను సొంతం చేసుకున్నాక కూడా ట్రోలు చేయ‌డం మొద‌లెట్టారు.

ఆర్సీబీ  ఫ్రాంచైజీ డబ్బును చెత్త‌లో పడేసిందంటూ విమ‌ర్శించారని" ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ద‌యాల్ తండ్రి చంద్ర‌పాల్ పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement