ఐపీఎల్-2025 సీజన్‌కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్‌మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ ఏడాది సీజన్‌లో ఎల్‌ఎస్‌జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.
ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్‌ఎస్‌జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?
ఇక కేఎల్ రాహుల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్‌ఎస్‌జి నుంచి రాహుల్‌ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి.
ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్‌ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు.
Comments
Please login to add a commentAdd a comment