సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) నేటితో ముగియనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు సిట్ ఇన్‌చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నివేదికను అందజేశారు. 150 పేజీల ప్రాధమిక నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ నివేదకను డీజీపీ.. ఈసీకి పంపనున్నారు.
కాగా రాష్ట్రంలో న్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ విచారించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు నాలుగు బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించింది సిట్. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్ బృందాలు.. హింసాత్మక ఘటనలకు కారణాలను విశ్లేషిస్తూ ప్రాథమిక నివేదిక రూపొందించింది. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాగా హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్‌లలో నమోదు అయిన 33 ఎఫ్‌ఐఆర్‌లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. హింసాత్మక ఘటనలు ముందస్తుగా ఊహించడంలో పోలీస్ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.
హింసాత్మక ఘటనల సమయంలో పోలీసుల ఉదాసీనతపైనా నివేదిక అందించింది. నేర స్వభావం కలిగిన వ్యక్తులని పూర్తిస్ధాయిలో బైండోవర్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించింది. ప్లీప్లాన్‌గానే హింసాత్మక ఘటనలు జరిగాయని, కర్రలు, రాళ్లు వంటివి ముందుగానే సిద్దం చేసుకోవడం ద్వారా హింసికు పాల్పడ్డారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
ఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్‌కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్‌చార్జి వినీత్ బ్రిజ్‌లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment