సాక్షి, విజయవాడ: ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. నాలుగు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సిట్.. 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలను పరిశీలించింది.
ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్.. దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.
రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్.. రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది.
ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్.. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment