Sakshi News home page

ఇద్దరికీ నో టికెట్‌ 

Published Fri, Mar 29 2024 5:22 AM

Pangi Raja Rao is Araku MLA candidate from BJP - Sakshi

బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు 

టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి 

ఇటీవలే అబ్రహం ఫైర్‌.. అదే రూట్లో దొన్నుదొర 

తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్నుదొర 

అరకు అభ్యర్థిగా దొన్నుదొర పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు 

ఇప్పుడు టికెట్‌ బీజేపీకి కేటాయించడంపై ఆగ్రహం  

అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు క్షుద్ర రాజకీయంపై అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణులు విస్తుపోతున్నారు. ఇక్కడ ఇద్దరు ఆశావహులను నమ్మించి ప్రోత్సహించి చివరకు మొండిచేయి చూపడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా జనవరి 20నే చంద్రబాబు సియారి దొన్నుదొర పేరును ప్రకటించారు. దీంతో పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ దివంగత మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సీవేరి అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. అనుచరులతో ఆయన ప్రచారమూ ప్రారంభించారు. ఫలితంగా పార్టీ వర్గాలుగా విడిపోయింది. బాబు ప్రకటనతో సియారి దొన్నుదొర కూడా ప్రచారం ప్రారంభించిన తరుణంలో బీజేపీ తన అభ్యర్థిగా పాంగి రాజారావు పేరును ప్రకటించింది. దీంతో దొన్నుదొరతోపాటు టీడీపీ కార్యకర్తలు ఖిన్నులయ్యారు. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలకు పార్టీని బలిపీఠం ఎక్కిస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

తాడోపేడో తేల్చుకునేందుకు దొన్నుదొర విజయవాడ బయలుదేరారు. ఇప్పుడు సివేరి అబ్రహంతోపాటు సియారి దొన్నుదొర కూడా  రెబల్‌గా బరిలో నిలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కార్యకర్తలు చెదిరిపోయే పరిస్థితులు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం చేస్తున్న టీడీపీ రెబల్‌ అభ్యర్థి సివేరి అబ్రహం చంద్రబాబు తనకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.       

Advertisement

What’s your opinion

Advertisement