టీ20 క్రికెట్‌లో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డు సాధించింది. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన పంజాబ్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
262 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్‌తో సౌతాఫ్రికా రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. కాగా ఐపీఎల్‌లో కూడా ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ పేరిట ఉండేది. 2020 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్‌పై 224 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.
ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(75), సునీల్ నరైన్(71) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వెంకటేశ్ అయ్యర్(39), శ్రేయస్ అయ్యర్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, రాహుల్ చాహర్, సామ్ కుర్రాన్ తలా వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment