KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి | Sakshi
Sakshi News home page

KKR vs PBKS: సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి! సన్‌రైజర్స్‌ రికార్డూ బ్రేక్‌

Published Sat, Apr 27 2024 11:59 AM

IPL 2024: KKR Vs PBKS Breaks Most Sixes Record In T20s Punjab Surpasses SRH

ఈడెన్‌ గార్డెన్స్‌లో శుక్రవారం పరుగుల వరద పారింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు బౌలర్లపై కనికరం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ కురిపించిన ఫోర్లు, సిక్సర్ల వర్షంలో మైదానం తడిసి ముద్దైంది.

ఇరు జట్లు పోటాపోటీగా హిట్టింగ్‌ చేస్తూ 37 ఫోర్లు.. 42 సిక్సర్లు బాదడంతో ఏకంగా 523 పరుగుల స్కోరు నమోదైంది. అయితే, ఈ పరుగుల యుద్ధంలో పంజాబ్‌ కింగ్స్‌ పైచేయి జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.

ఐపీఎల్‌-2024లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌(37 బంతుల్లో 75)- సునిల్‌ నరైన్‌(32 బంతుల్లో 71) దుమ్ములేపగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌(39) రాణించాడు.

వీరితో పాటు రసెల్‌(12 బంతుల్లో 24), శ్రేయస్‌ అయ్యర్‌(10 బంతుల్లో 28) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 17 సిక్స్‌లు నమోదయ్యాయి.

ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 54), జానీ బెయిర్‌ స్టో (48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 108(నాటౌట్‌)), రీలీ రోసో(16 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్స్‌ల సాయంతో 26), శశాంక్‌ సింగ్‌(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 68 నాటౌట్‌) దుమ్ములేపారు.

ఈ నేపథ్యంలో పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డు బ్రేక్‌ చేసింది. ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా.. రైజర్స్‌ పేరు చెరిపేసి ఆ ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఇటీవల రైజర్స్‌ ఆర్సీబీ మీద 22 సి👉క్స్‌లు బాదింది.

ఇక సిక్సర్ల విషయంలో పంజాబ్‌ ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో రెండోస్థానంలో నిలిచింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్‌ జట్టు మంగోలియా మీద 26 సిక్స్‌లు కొట్టింది.

ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌లు, సాధించిన జట్లు
👉24- పంజాబ్‌ కింగ్స్‌- కేకేఆర్‌ మీద- కోల్‌కతాలో- 2024
👉22- సన్‌రైజర్స్‌- ఆర్సీబీ మీద- బెంగళూరులో- 2024
👉22- సన్‌రైజర్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మీద- ఢిల్లీలో- 2024
👉21- ఆర్సీబీ- పుణె వారియర్స్‌ మీద- బెంగళూరు- 2013 .

పురుషుల టీ20లలో అత్యధిక సిక్సర్లు నమోదైన టాప్‌-3 మ్యాచ్‌లు
👉42- కేకేఆర్‌- పంజాబ్‌- కోల్‌కతా- 2024
👉38- సన్‌రైజర్స్‌- ముంబై ఇండియన్స్‌- హైదరాబాద్‌- 2024
👉38- ఆర్సీబీ- సన్‌రైజర్స్‌- బెంగళూరు- 2024

Advertisement
Advertisement