యూపీఏకు ప్రజామోదం  | Sakshi
Sakshi News home page

యూపీఏకు ప్రజామోదం 

Published Sun, Apr 28 2024 5:31 AM

Strengths of parties in 15th Lok Sabha

వరుసగా రెండోసారి సర్కారు

ఫలించని బీజేపీ ‘ఉగ్ర’ ప్రచారం 

2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారమంతా లౌకికవాదం, ఉగ్రవాదం, మతతత్వం చుట్టూ తిరిగింది. ఐదేళ్లలో అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రధానంగా నమ్ముకుంది. ఉద్యోగావకాశాల కల్పన, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలను ప్రజలకు గుర్తు చేసింది. మత, భాష, ప్రాంతీయ వాదం, కుల వాదాలకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేసింది. యూపీఏ హయాంలో ఉగ్రవాదం పెచ్చు మీరిందని బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. మరోవిడత యూపీఏనే ఆశీర్వదించారు...   – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

2009లో 15వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 16 నుంచి మే 13 దాకా ఐదు దశల్లో జరిగాయి. 2004లో జనం తన పాలనను తిరస్కరించడంతో నొచ్చుకున్న వాజ్‌పేయి ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దాంతో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీ తెరపైకి వచ్చారు. కానీ ఆయన పట్ల పలు ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా లేవు. యూపీఏలోనూ కాస్త అనిశ్చితి నెలకొంది.

మళ్లీ గెలిస్తే రాహుల్‌ను ప్రధాని చేస్తారన్న ప్రచారం సాగినా మన్మోహనే కొనసాగుతారని సోనియా స్పష్టం చేశారు. ఎన్నికలకు 5 నెలల ముందు ముంబై ఉగ్ర దాడి 170 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో దేనికీ మెజారిటీ రాకపోవచ్చని అంతా అంచనా వేశారు. కాంగ్రెస్‌ బలం 145 నుంచి 206 ఎంపీలకు పెరిగింది. బీజేపీ 22 స్థానాలు కోల్పోయి 116కు పరిమితమైంది. యూపీఏకు 261 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాల సాయంతో మొత్తం 322 మంది ఎంపీల మద్దతుతో మన్మోహన్‌ మరోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్‌కు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 33 స్థానాలు లభించాయి! సీపీఎం సారథ్యంలోని థర్డ్‌ ఫ్రంట్‌కు 78 సీట్లొచ్చాయి. 

నియోజకవర్గాల పునర్విభజన 
2001 జనాభా లెక్కల ఆధారంగా 2008లో లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఇది కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందంటారు. 499 స్థానాల స్వరూపం మారింది. ఆ మేరకు ఓటర్ల జాబితాల్లోనూ మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది. 

కుంభకోణాలతో అప్రతిష్ట 
యూపీఏ పాలనలో అతి పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. 2జీ స్కాం వీటిలో ముఖ్యమైనది. డీఎంకే నేత ఎ.రాజా టెలికం మంత్రిగా ఉండగా 2008లో 122 కొత్త టెలికం లైసెన్స్‌లు జారీ చేశారు. అనుభవం లేని కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో ఖజానాకు ఏకంగా రూ.1.76 లక్షల కోట్ల నష్టం జరిగిందని కాగ్‌ పేర్కొంది. 2004–11 మధ్య 194 బొగ్గు గనులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల మరో రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు తేల్చింది! 
విశేషాలు 

2009 సార్వత్రిక ఎన్నికలు ఇద్దరు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్ల సారథ్యంలో జరగడం విశేషం! ఏప్రిల్‌ 20న తొలి దశ పోలింగ్‌ ఎన్‌.గోపాల స్వామి ఆ«ధ్వర్యంలో, మిగతా దశలు నవీన్‌ చావ్లా పర్యవేక్షణలో జరిగాయి. వీరి విభేదాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్‌ 20న రిటైరైన గోపాలస్వామి, ఆలోగా ఒక విడత పోలింగైనా నిర్వహించాలని భావించారు. దాన్ని ఎన్నికల కమిషనర్‌గా చావ్లా వ్యతిరేకించడం, ఆయన్ను తొలగించాలంటూ రాష్ట్రపతికి గోపాలస్వామి సిఫార్సు చేయడం కలకలం రేపింది. 
► 2009 ఎన్నికల్లో ఏకంగా 114 మంది అభ్యర్థులు కేవలం 3 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 
►యూపీఏ తొలి ఐదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతంతో ఆల్‌టైం గరిష్టానికి చేరింది. 
► 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని యూపీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది. 

ఫొటో ఓటర్‌ జాబితాలు 
ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ల స్టాంప్‌ సైజు ఫొటోలతో జాబితాలను ప్రవేశపెట్టింది. దాంతో 2009 లోక్‌సభ ఎన్నికలను ఫొటో ఓటర్ల జాబితాలతో జరిగాయి. అప్పటిదాకా వాటిపై కేవలం పేర్లే ఉండేవి. అయితే అసోం, నాగాలాండ్, జమ్మూ కశీ్మర్‌లో మాత్రం ఫొటోల్లేని జాబితాలనే ఉపయోగించారు. 

15వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు 
(మొత్తం స్థానాలు 543) 
పార్టీ            స్థానాలు  
కాంగ్రెస్‌  -  206 
బీజేపీ    -   116 
ఎస్పీ     -   23 
బీఎస్పీ   -  21 
జేడీయూ  - 20 
టీఎంసీ   - 19 
డీఎంకే   - 18 
బిజూ జనతాదళ్‌  -  14 
శివసేన  - 11 
ఇతరులు   -  86 
స్వతంత్రులు  -   9   

Advertisement
Advertisement