
బీజేపీకి వెన్నుపోటులో చిన్నమ్మదే పెద్ద చేయి
నాడు బాబుతో కలిసి ఎన్టీఆర్‌కూ వెన్నుపోటు
నేడు అదే మరిది కోసం కమలం పార్టీ తాకట్టు
తెర వెనక్కు వెళ్లిన భర్త డాక్టర్ దగ్గుబాటి
స్వార్థమే పరమావధిగాచిన్నమ్మ అడుగులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చిన్నమ్మ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు పురందేశ్వరి. మెట్టినిల్లు దగ్గుబాటి ఇంట అడుగిడి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. వీటితోపాటు తాజాగా ఆమె ఘనతలో మరోసారి ‘వెన్నుపోటుదారు’అనే అలంకారం చేరింది. అదికూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీజేపీ నుంచే కావడంతో చిన్నమ్మ మరింత చిన్నబోయారు.
నాడు–నేడు బాబుకే చేదోడు
సీఎం పీఠం కోసం అవమానకరంగా ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేసిన నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారునిగా అందరి నోళ్లలో నిత్యం నానుతూనే ఉన్నారు. ఈ వెన్నుపోటు వ్యవహారంలో పురందేశ్వరి భర్త, బాబుకు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనవంతు పాత్ర పోషించినట్లు పలు సందర్భాలలో బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన అంకంలో భర్తను గట్టిగా ప్రోత్సహించి, మరిది బాబుకు చేదోడువాదోడుగా నిలిచారని పురందేశ్వరి గురించి అయినవారంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పొత్తుల ముసుగులో తన పార్టీకన్నా టీడీపీకే మద్దతిస్తున్నారని కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షురాలిగా ఈ స్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడవటాన్ని అంతర్గత సమావేశాల్లో నాయకులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.
5 ఎన్నికలు... 4 స్థానాలు
పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం గమనిస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తన తండ్రి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే.. ఈమె హస్తం పంచన చేరి, 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. బాబు తమ కుటుంబానికి చేసిన మోసం వల్లే కాంగ్రెస్‌లో చేరినట్లు సమరి్ధంచుకున్నారు. అదే వాస్తవమైతే ఇప్పుడు చంద్రబాబుకు అంతలా వత్తాసు ఎలా పలుకుతున్నారన్నది విశ్లేషకుల ప్రశ్న. బాపట్ల రిజర్వుడు స్థానం కావడంతో 2009లో విశాఖ నుంచి పోటీచేశారు. రెండుసార్లూ దివంగత మహానేత వైఎస్సార్ హవా తన విజయానికి బాటలు వేసింది.
కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర విభజన సాకుతో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి ఎన్డీయే అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి చేతిలో దారుణ ఓటమి చవిచూశారు. 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్ధిగా 33,892 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే అభ్యర్ధిగా బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ స్థానంలో పోటీకి దిగారు.
స్వార్థమే పరమావధిగా...
2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయగా పురందేశ్వరి విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ దగ్గుబాటికి నాయకునిగా ప్రత్యేక గుర్తింపు లేకపోలేదు. గత ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. చిన్నమ్మ కోసం పరోక్ష రాజకీయాలు చేస్తూ తెరమరుగవ్వాల్సి వచ్చిందని ఆయన వీరాభిమానులు వాపోతున్నారు. ఆయన మాత్రం తనకు రాజకీయాలంటే విముఖతని చెప్తూనే.. పురందేశ్వరి కోసం తాజాగా రాజమండ్రిలో తిష్ట వేయడం గమనార్హం.
ఎన్టీఆర్‌ను మించిన నటి చిన్నమ్మ: నందమూరి లక్ష్మీపార్వతి
‘అవును, నేను చెబుతున్నది యదార్థం. ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపించి మహానటుడిగా వినుతికెక్కారు. చిన్నమ్మ తెరవెనుక నటనలో మహానటిని మించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు వ్యవహారంలో కుటుంబపరంగా పురందేశ్వరి పాత్రను తెలుసుకున్న ఎన్టీఆర్ అభిప్రాయమిది. ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందునే ఈ మాటలు చెప్పగలుగుతున్నానని’ నందమూరి లక్ష్మీపార్వతి ’సాక్షి’కి తెలిపారు. ‘చంద్రబాబు, రామోజీల వెన్నుపోటు కుట్ర గురించి దగ్గుబాటికి తొలుత తెలియదు.
బాబుకు సహకరించే క్రమంలో పురందేశ్వరే కుటుంబ సభ్యులను కూటమి కట్టేలా చేసింది. భర్తను దగ్గరుండి వైశ్రాయ్ హోటల్‌కు పంపింది. ఆ వెంటనే ఎన్టీఆర్ వద్దకు వచ్చి పక్కన కూర్చుంద’న్నారు. చిన్నమ్మ నాటకాలు ఆ సమయంలో గుర్తించలేకపోయినా ఆ తరువాత వెన్నుపోటుకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలిశాయని, నటనలో తనను కూతురు మించిపోయిందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారని లక్ష్మీపార్వతి వివరించారు.
బీజేపీకి భారీ వెన్నుపోటు
టీడీపీ, జనసేనతో జట్టు కట్టిన బీజేపీ ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుండగా, ఆయా స్థానాల ఎంపిక, అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో మరిది బాబుతో కలిసి చిన్నమ్మ ఆడిన డ్రామాలను ప్రజలు గమనించకపోలేదు. అనపర్తిలో మాజీ సైనికుడు శివకృష్ణరాజును కాదని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కట్టబెట్టారు. కడప జిల్లా బద్వేలు అభ్యర్థి రోశన్న టీడీపీ కండువా తీసేసిన మరునాడే బీజేపీ టికెట్ దక్కింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎన్.ఈశ్వరరావులు ఏ పార్టీ వారో అందరికీ తెలుసు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించారు. అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న సీఎం రమేశ్ చంద్రబాబు జేబులో మనిషి. కాపులకు బీజేపీ నుంచి ఒక్క టిక్కెట్ కూడా దక్కకపోవడానికి పురందేశ్వరే కారణమని ఆ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. తన కళ్ల ముందు ప్రధాని మోదీ ఫ్లెక్సీలను కొందరు టీడీపీ కార్యకర్తలు చింపుతున్నా, కనీసం వారించకుండా మౌనం వహించిన చిన్నమ్మ వైఖరి బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది.