చంద్రబాబు ఏదైనా అనొచ్చంట.. పురందేశ్వరికి విజయసాయి కౌంటర్‌ | Tirupati Laddu row : Vijaya Sai Reddy Fire On Purandeswari | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఏదైనా అనొచ్చంట.. పురందేశ్వరికి విజయసాయి కౌంటర్‌

Published Wed, Oct 2 2024 11:19 AM | Last Updated on Wed, Oct 2 2024 12:02 PM

Tirupati Laddu row : Vijaya Sai Reddy Fire On Purandeswari

సాక్షి,అమరావతి : మీ వైఖరి కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే ఎక్కువ అన్నట్లుగా ఉందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వెఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు రాజకీయాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడుతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్‌ చేయడం సరికాదు’ అంటూ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

ఆ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి.

..పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేశారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి.

ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి! కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా...గోవిందా. చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డుప్రసాదాల విషయంలో దెబ్బయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు’ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement