సాక్షి,అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లమీద మాట్లాడే బాబు,లోకేష్, పవన్ సుప్రీం కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడిన మీరు అత్యున్నత న్యాయం స్థానం అడిగిన ప్రశ్నలు బదులు ఇవ్వచ్చు కదా? అని రోజా అన్నారు.
సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏమన్నారంటే?
తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబును తూర్పారబట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు.
‘‘సీఎం(చంద్రబాబును ఉద్దేశిస్తూ)రాజ్యంగం పరంగా రాష్ట్రాదినేత. సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉందంటూ’’ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు.
నీళ్లు నమిలిన సిదార్థ్ లూథ్రా
గత సోమవారం (సెప్టెంబర్ 30న)సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.
‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.
ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?
ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు?
సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.
కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?
లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు?
కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’
అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. గురువారం (అక్టోబర్ 3న) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment