తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ దర్యాప్తు కొనసాగడమా? లేదంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం నిర్ణయం వెల్లడించనుంది.
గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లడ్డూ ప్రసాదంపై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. అలాగే.. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని గట్టిగానే మందలించింది. అదే టైంలో స్వతంత్ర దర్యాప్తు అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం కోరింది సుప్రీంకోర్టు. ఆయన అభిప్రాయం మేరకు కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది.
‘‘రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. జూలైలో రిపోర్టు వస్తే.. సెప్టెంబర్‌లో మీడియాకు ఎందుకు చెప్పారు?. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి. కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. తిరస్కరించిన నెయ్యి లడ్డూ తయారీలో వాడలేదని ఈవోనే స్వయంగా చెబుతున్నారు కదా?. కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు ఉన్నాయా?. సిట్ వేసిన తర్వాత మళ్లీ మీడియాకు ఎందుకు వెళ్తున్నారు’’ అంటూ గత విచారణలో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
కాగా, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు
అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (సెప్టెంబర్ 30) మధ్యాహ్నం విచారణ జరిపింది.
పిటిషనర్ సుబ్రమణియన్ స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగగా.. వాటిని కోర్టు రికార్డు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment