తప్పు చేస్తున్నావ్‌ చంద్రబాబూ.. వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం | YSRCP Response To Chandrababu Govt Restrictions On YS Jagan Visit To Tirumala | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తున్నావ్‌ చంద్రబాబూ.. వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం

Published Fri, Sep 27 2024 12:44 PM | Last Updated on Fri, Sep 27 2024 3:14 PM

YSRCP Response To Chandrababu Govt Restrictions On YS Jagan Visit To Tirumala

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని.. కానీ వైఎస్‌ జగన్‌పై మాత్రం బురదజల్లుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్‌ సురేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ వ్యవహారం వాళ్ల వైపే వేళ్లు చూపే పరిస్థితి వచ్చింది. ఒక మతంపై బురద జల్లడంపై చంద్రబాబు, పవన్‌కు బుద్దిలేదని ప్రజలు భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌.. స్వామి వారి దర్శనానికి వెళ్తుంటే కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. పోలీసులతో నోటీసులు ఇప్పించి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల దర్శనానికి అనుమతి దేనికీ..? అనుమతి లేదని నోటీసులు ఇవ్వడం ఏమిటి..?. మా పేరు చెప్పి సాధారణ భక్తులను కూడా ఇబ్బందీ పెడుతున్నారు. మేం ఇలానే ఆలోచిస్తే చంద్రబాబు మా ప్రభుత్వంలో తిరిగే వాడే కాదు’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

ఇదీ చదవండి: తిమ్మిని బమ్మిని చేసే యత్నం.. బాబు పాత టెక్నిక్‌!

నీచమైన మత రాజకీయాలొద్దు: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా 
ఈ వంద రోజుల్లో ప్రజలకు మీరు ఏమి ఒరగబెట్టారని పండుగలు చేసుకుంటున్నారు..?. మీ సూపర్ సిక్స్‌లో ఎన్ని అమలు చేశారు..?. మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల వద్దకు వెళ్లాం. మీరు వెళ్తుంటే ప్రజలంతా మిమ్మల్ని నిలదీస్తున్నారు. మన రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ రోజు తిరుమల వెళ్లకుండా నోటీసులు ఇచ్చారు.

..మా రాష్ట్ర అధ్యక్షుడు వస్తుంటే మమ్మల్ని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. లడ్డూ వ్యవహారాన్ని తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారు. పరమ భక్తితో మొక్కే జగన్‌పై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. విజయవాడలో గుళ్లను కూల్చిన వ్యక్తి చంద్రబాబు అయితే.. వాటిని జగన్‌ పునర్నిర్మించారు. దేవుళ్లను రాజకీయాలకు వాడుకుంటున్నావ్.. మంచిది కాదు. ఇప్పటికే ఒకసారి నీకు దేవుడి దెబ్బ తగిలింది.. ఇప్పుడు ఏమి జరుగుతుందో ఆ దేవుడికే ఎరుక. చంద్రబాబూ.. నీచమైన మత రాజకీయాలొద్దు. హుందాతనంగా రాజకీయాలు చేయాలి

ఇది సరికాదు చంద్రబాబూ..:  మేయర్‌ సురేష్‌ బాబు
పవిత్రమైన దేవదేవుని లడ్డూ ప్రసాదంపై అపవిత్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు సరికాదు. అలాంటి వ్యక్తికి జనసేన, బీజేపీ తోడయ్యి మాటలాడటం దారుణం. వైఎస్‌ జగన్ హిందూ దేవాలయాలకు ఎందుకు వెళ్ళకూడదో వారు చెప్పాలి. ఏదో ఒక రోజు ప్రజలు మీకు బుద్ధి చెప్పక తప్పదు. దేశంలో ఎవరూ చేయని సంస్కృతిని చంద్రబాబు తీసుకొచ్చాడు

చంద్రబాబు తప్పు మీద తప్పు: పోతిన మహేష్‌
విజయవాడ: వైఎస్‌ జగన్‌ తిరుమల వెళ్తుంది శ్రీవారి దర్శనానికి ధర్నాకి కాదని.. చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ ప్రశ్నించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి తిరుమల ఆలయ దర్శనం చేసుకున్నారు ఆ సమయంలో ఎటువంటి డిక్లరేషన్ అడగలేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ దర్శనం చేసుకున్నప్పుడు ఎవరు డిక్లరేషన్ గురించి ప్రస్తావించలేదు. ఈ విషయాన్ని పురందరేశ్వరి ఆ సమయంలో ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు.

తిరుమల ఆలయ ప్రతిష్టతను శ్రీవారి విశిష్టతను చంద్రబాబు రాజకీయం చేస్తూ తప్పు మీద తప్పు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో మీరు అనేక ఆలయాల్లో దర్శనం చేసుకున్నారు ఆ రోజున మీకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనంలో ఏ చిన్న అలజడి, అవాంతరం జరిగిన దానికి చంద్రబాబు, కూటమి ప్రభుత్వానిదే  బాధ్యత. తిరుమల దర్శనానికి నిబంధనల ప్రకారం నలుగురు లేదా ఐదుగురు వెళతారు ఎవరైనా వేల మందితో వెళ్తారా?. తిరుమల ఆలయ విశిష్టతను రాజకీయాల కోసం వాడుకుంటూ అలజడలు సృష్టించాలని, సెక్షన్ 30 అమలు, నోటీసులు జారీ, ముందస్తు అరెస్టులు వెంకన్న స్వామి దర్శనానికి రావద్దని ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి.’’ అని పోతిన మహేష్‌ అన్నారు.

కూటమి నేతలకు భయం పట్టుకుంది: ఉషశ్రీ చరణ్‌
తాడేపల్లి: వైఎస్‌ జగన్‌ తిరుమలకు వెళ్తున్నట్లు ప్రకటించగానే కూటమి నేతలకు భయం పట్టుకుందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. తమ నేతలకు నోటీసులిచ్చి గృహనిర్భంధం చేశారని మండిపడ్డారు. వందరోజుల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అందుకే వందరోజుల సమావేశంలో లడ్డూ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు. నిజాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబుకి భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మేం తిరుమల దర్శనం చేసుకోకూడదా

అభాండాలు మోపి పాపాలు చేశారు కాబట్టే పవన్ దీక్ష చేస్తున్నాడు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్లు సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. వైఎస్సార్ కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంట్లో దీపారాధన వద్ద మా నాన్న సిగరెట్ వెలిగించుకున్నారని చెప్పిన వ్యక్తి కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. దేవుడి పేరుతో చంద్రబాబు,పవన్, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. దీనికి భవిష్యత్తులో ఫలితం మీరు అనుభవించక తప్పదు. ధర్మాన్ని కాపాడే నాయకుడు మా జగన్‌’’ అని ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు.


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement