ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక విశిష్టత ఉంది. చెప్పదలుచుకున్న అబద్ధాన్ని నిజం అనిపించడానికి అన్ని అవకాశాలూ వాడుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై బురద వేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. మొహమాటపడరు కూడా. శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఒక తప్పుడు ఆరోపణ చేసి దాన్ని నిజం చేసేందుకు ఇప్పుడు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు చంద్రబాబు నైజానికి తాజా నిదర్శనం. సీబీఐ విచారణకు ససేమిరా అంటూ తనకు కావాల్సిన అధికారులతో ఏర్పాటు చేసుకున్న సిట్‌తో కొత్త డ్రామా కూడా అదే. ఈ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ కూడా పూర్తిస్థాయిలో సిద్ధం కావడంతో తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు హైరానా పడుతోంది. నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు కనిపించిన చెత్తా చెదారమంతా పోగేసి ప్రచారం చేస్తోంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపేశామని ముందు చెప్పిన టీటీడీ అధికారులు ఇప్పుడు మాట మారుస్తూండటం! కల్తీ గురించి తెలియక నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీలో వాడేశామంటున్నారు వాళ్లిప్పుడు! ఈ కథనం కూడా ఈనాడులోనే ప్రచురితమైంది. అంతేకాదు... ఏఆర్ డెయిరీ ఫుడ్స్ జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని మాకు సరఫరా చేసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు.. అంటే రెండు నెలల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యమైంది ఎందుకు అన్న ప్రశ్నకు వారిస్తున్న సమాధానం మరీ విచిత్రంగా ఉంది. సరఫరా అయిన తరువాత అనుమానం కొద్దీ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపామని అంటున్నారు! కొందరు స్వార్థపూరిత శక్తులతో చేతులు కలిపిన ఏఆర్ డెయిరీ కుట్రపూరితంగా ఇలా చేసిందని టీటీడీ జీఎం మురళీ కృష్ణ తన ఫిర్యాదులో చెప్పుకొచ్చారని సమాచారం. ఈ ఫిర్యాదులోని అంశాల్లో నిజానిజాలను కాసేపు పక్కన బెడదాం.
టీటీడీ అధికారులు స్వయంగా.. కల్తీ గురించి తెలియక లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని వాడేశామంటే.. అది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లు ఒప్పుకోవడమే కదా? అంటే... ప్రభుత్వం ఇంతకూ తెగించిందన్నమాట. ప్రజలన్ని మోసం చేసినా ఫర్వాలేదు కానీ.. తమ రాజకీయ లక్ష్యాలు మాత్రం నెరవేరాలని అనుకుంటున్నట్లే. కల్తీ జరిగిన నెయ్యిని భక్తులు తిన్నారని చెప్పడం దుర్మార్గం. ఇదంతా చంద్రబాబు కుత్సిత రాజకీయ నాటకంలో రెండో అంకమని అనుకోవాలి. ఈవో అబద్ధం చెప్పాడా? లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీపై బాబు అసత్య ప్రచారం మొదలైన సమయంలో ఆయన స్వయంగా నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు ఏమన్నాడన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలిప్పుడు.
ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించి వెనక్కు పంపామని ఆయన ఎందుకు చెప్పారు? అందుకు భిన్నంగా నెయ్యిని వాడేసి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి కదా? ఎందుకు బాబు ప్రభుత్వం వెనకాడుతోంది? కల్తీ జరిగిందని గుర్తించక వాటిని వాడేశామని టీటీడీ అధికారులు నిస్సిగ్గుగా చెబుతుంటే మూడు నెలలైనా వారిపై చర్యలేవి? కేసు వివరాలు ఇప్పుడు ఈనాడులో ప్రముఖంగా వచ్చాయి. ఆ పత్రిక ఎక్కడా ఇలాంటి సందేహాలను లేవనెత్తక పోవడం.. ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా కథనం ప్రచురించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అదే సమయంలో లడ్డూ తయారీకి వాడుతున్న జీడిపప్పు, యాలకులు నాసిరకం అంటూ మరో కథనాన్ని ఈనాడు అచ్చుగుద్దింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో అడుగడుగునా అవకతవకలు జరిగాయని విజిలెన్స్ వారు ఇప్పుడు కనిపెట్టారట. ఎంత హాస్యాస్పదం.
నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా టీటీడీకి సంబంధించిన వివిధ సమస్యలపై వార్తలు వస్తునే ఉంటాయి. తిరుమల భక్తుల అగచాట్లపై ఇదే ఈనాడు మూడు దశాబ్దాల క్రితం కూడా కథనాలు ప్రచురించింది. విశేషమేమిటంటే మతం, దైవం అంటే అంత విశ్వాసం లేని సీనియర్ పాత్రికేయుడు, ఏడు తరాల పేరుతో రూట్స్ గ్రంథానిన అనువదించిన ప్రముఖుడు అయిన ఉమా మహేశ్వర రావును ఇందుకోసం ఈనాడు యాజమాన్యం ప్రత్యేకంగా తిరుమలకు పంపి మరీ కథనాలు సిద్ధం చేయించింది.
మరి... ఇందుకు అప్పుడు తిరుమలకు అపచారం జరిగిందని అప్పుడెవరూ గొడవ చేయలేదే! కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీపై ఏదో ఒక బురద చల్లడం కోసం రకరకాల దిక్కుమాలిన రిపోర్టులు తయారు చేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది ఈనాడు! ఇక ఆంధ్రజ్యోతి ఒక కథనం రాస్తూ లడ్డూ ప్రసాదం అపవిత్రం అవడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా ఉందని రాశారు. అంటే చంద్రబాబు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా వీరు భజన చేస్తున్నారన్న మాట. ఈ విషయమై డిజిపి సిట్ అధికారులకు దిశా నిర్దేశం చేశారట. కల్తీ నెయ్యిపై శ్రీ వైష్ణవులు అభ్యంతరం చెబితే వారిని బెదిరించారని కొత్త కథలు అల్లుతున్నారు. ఈ రకంగా చంద్రబాబు చేసిన తప్పును కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీపై ఆరోపణ చేయడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. జంతు కొవ్వు కలిసిన నెయ్యి తమ చేతికి అంటిందని భావించి ఉంటే శ్రీవైష్ణవులు అప్పుడే కచ్చితంగా నిరసన తెలిపేవారు.
అసలు అలాంటి కల్తీ జరిగితే ఆ వాసనను వీరు భరించడమే కష్టమయ్యేది. శ్రీవారిని నమ్మే వారు ఎవరో చేసిన బెదిరింపులకు ఎందుకు భయపడతారు? టీటీడీ మీడియా కట్టు కథలు రాస్తున్నది అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? ఈ మీడియా చెప్పేవాటిలో నిజముంటే చంద్రబాబు ప్రభుత్వం ఇంతకాలం చర్య తీసుకోకుపోవడంలో మతలబు ఏంటో వివరించాలి కదా! మొత్తం ఇదంతా కూడా బ్లాక్ మెయిల్ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరిగితే తాము చేసిన ఘోర అపచారం బయటకు వస్తుందేమోనని భయపడి చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే మీడియా ముందస్తుగా కొత్త కథలు అల్లి జనంపై రుద్దుతున్నట్టుగా వుంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో దేవాలయాలకు సంబంధించి ఏ చిన్న ఘటన జరిగినా దాని వెనక పలుచోట్ల జనసేన, తెలుగుదేశం వారి హస్తముందని పోలీసుల విచారణలో వెల్లడైనా అదంతా వైఎస్సార్సీపీవారి పనేననంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు అసత్య ప్రచారం చేసేవారు. మత రాజకీయం చేయడానికి ఎక్కడా వెనకాడేవారు కాదు. ప్రస్తుతం తిరుమల లడ్డూ విషయంలో కూడా అదే తరహా మత రాజకీయం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక రథాన్ని కొందరు దుండగులు దగ్ధం చేశారు. మరి ఇది టీడీపీ ప్రభుత్వానికి మచ్చ కాదా? ఈ దుశ్చర్యను వైసీపీకి పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాత్రం ఈ ఘటనకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయం ఇలా ఉంటుందన్నమాట. అంతే కాకుండా ఇలాంటి నేరాలు చేస్తే మక్కెలిరగ్గొడతామని సీఎం చెబుతున్నారు.ఇంతకాలం జరిగిన హింసాకాండను ఆయన ఎలా సమర్థించారో చెప్పాలి. దౌర్జన్యాలకు పాల్పడ్డ ఎంతమంది టీడీపీ శ్రేణుల మక్కెలు విరగ్గొట్టారు? కబుర్లు ఆకాశానికి అంటుతాయి. చర్యలు మాత్రం పాతాళంలో ఉంటాయి.!
వైఎస్ జగన్ హయాంలో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు ,పవన్ కల్యాణ్ లు ఎన్నిరకాలుగా రెచ్చగొట్టేవారో చూశాం. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక కూడా అదే రకంగా మత రాజకీయాలు చేస్తూ ఉసిగొలుపుతూ, పైగా ఎదురు దాడి చేస్తున్నారు. అదే కాదు విజయవాడ వరదల్లో చాలా సాయం చేశామంటూ ఒక సమావేశం పెట్టుకొని అందులో కూడా తన కుట్ర రాజకీయాలను వదలి పెట్టలేదు. బోట్లను నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి వైఎస్సార్‌సీపీ కుట్ర పన్నిందని ఆయన మరోసారి ఆరోపించారు. ఆ బోట్లు తెలుగు దేశం వారివి అని తెలిసినా ఆయన ఇలా మాట్లాడుతూనే ఉంటారు. వరదల్లో ఆయనకు ఆయనే సర్టిపికెట్ ఇచ్చుకుంటారు. మంచి చేస్తే ఫర్వాలేదు. కానీ వరద బాధితులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు.
వరద సాయం అందడంలో కొన్ని సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. రేషన్ కార్డులు లేవని సాయం అందని భవానీ పురం కరకట్ట వాసులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోవద్దు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో, చంద్రబాబు పాలన గతంలో ఎన్నడూ లేని విధంగా నాసిరకంగా, మత రాజీకాయలు చేయాలన్న లక్ష్యంతో, అబద్దాల పాలన సాగుతుండడం అత్యంత దురదృష్టకరం. వీటితో సూపర్ సిక్స్ హామీలను జనం మరిచిపోతారని ప్రభుత్వ నేతలు భ్రమపడుతున్నారేమో!
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment