తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం సుప్రీంకోర్టును తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టిన తీరు గమనించారా? తాను అర్ధవంతంగా మాట్లాడడం లేదని ఆమెకు తెలుసు. అందుకే కొంత తడబాటుగా, మరికొంత పొడి, పొడిగా మాట్లాడారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమర్థించడానికి ఆమె తంటాలు పడ్డారు. నిజానికి ఇలాంటి సందర్భాలలో నిజాయితీగా మాట్లాడితే వారి విలువ పెరుగుతుంది. ఎంత మిత్రపక్షమైనా, వారు ఏమి చేసినా సమర్థిచే దశకు వెళితే ఆ మరక వీరికి కూడా అంటుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
ఇప్పటికే కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ వెనుకబడి పోతానో అని ఏదో దీక్ష అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గబ్బు అయ్యారు. చివరికి తాను లడ్డూ కల్తీ గురించి తిరుమల యాత్ర చేయలేదని, గత ఐదేళ్లలో పాపాలు జరిగాయని అందుకు ప్రాయశ్చితంగా వెళ్లానని చెప్పవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు అబద్దాలు ఆడడం, మాట మార్చడం కొత్తకాదు. కాని ఈసారి మరీ గట్టిగా బుక్ అయ్యారు. చంద్రబాబును గుడ్డిగా బలపరచబోయి పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు అప్రతిష్టపాలయ్యారు.
తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అయిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సంచలన వ్యాఖ్య చేసి, దానికి ఆధారాలు చూపించలేక, పల్టీలు కొట్టిన చంద్రబాబు దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారు. హిందువుల దృష్టిలో ఆయన దేవుడి పట్ల తీరని అపచారం చేశారు. అలాంటి వ్యక్తిని సమర్థించిన వీరిద్దరూ కూడా అపచారం చేసినట్లే అవుతుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి, రాజ్యసభ సభ్యుడు, మాజీ టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు వేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో పలు ప్రశ్నలను న్యాయమూర్తులు సంధించారు.
ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు
లడ్డూ కల్తీ అయిందనడానికి ఆధారాలు ఏమిటి? లడ్డూని ఎందుకు పరీక్షకు పంపించలేదు. ఎన్.డి.డి.బి రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత ఎందుకు వెల్లడి చేశారు. అందులో ఎక్కడా నిర్దిష్టంగా జంతు కొవ్వు కలిసిందని లేదే? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడవచ్చా? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ పలు వ్యాఖ్యలను గౌరవ న్యాయమూర్తులు చేశారు. ఈ వ్యాఖ్యలపై బిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు. అవి అర్ధవంతంగా ఉండాలి. అంతే తప్ప, కోర్టు ధిక్కార ధోరణిలోనో, న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే రీతిలో ఉండకూడదు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబే ఇంతవరకు స్పందించలేకపోయారు! దానికి కారణం కేవలం తాను తప్పు చేశానన్న సంగతి తెలుసు కనుక. జంతుకొవ్వు లడ్డూలో కలిసిందని తప్పుడు ఆరోపణ చేసి దొరికిపోయానన్న విషయం తెలుసు కనుక.
ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!
అంతేకాదు.. సెప్టెంబర్ ఇరవై ఒక్కటో తేదీన తనతో శ్రీవెంకటేశ్వరస్వామే నిజాలు చెప్పిస్తున్నారంటూ ప్రసాదం లడ్డూపై అబద్దాలు ఆడారని తేలిపోయింది. చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో లడ్డూలో జంతునెయ్యి కలిసిందని చెప్పగానే, అలా మాట్లాడడం తప్పు అని పురందేశ్వరి ఆయనను వారించి ఉంటే మంచి పేరు వచ్చేది. ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా అధినేత స్థానంలో ఉన్నారని అంటున్నారు. అయితే రాజ్యాంగానికి అతీతంగా అబద్దాలు చెప్పవచ్చా అన్నదానికి ఆమె సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగ పదవి అయితే, న్యాయమూర్తుల పదవులు రాజ్యాంగ పదవులు కావా? సీఎంకు ఉన్న పరిస్థితులు సమీక్షించుకుని మాట్లాడాలా? వద్దా అనేది ఆయన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని పురందేశ్వరి అంటున్నారు.
ఎంత సీఎం అయినా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ ఇవ్వవచ్చా?. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీయవచ్చా?. గతంలో కూడా పలు సందర్భాలలో న్యాయస్థానాలు పలువురి ప్రకటనలు రాజ్యాంగ స్పూర్తిగా విరుద్దంగా ఉంటే తప్పు పట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా అమలు అవుతుందా?లేదా అనేది కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని ఏదో అర్థం లేని మాట చెప్పారు. ఇందులో నిర్ణయం ఏముంది? ఒక అబద్దం చెప్పడానికి సీఎంకు అధికారం ఉంటుందని ఆమె వాదించదలిచారా?. ఈ మధ్యనే ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కొంత అతిగా స్పందించారు. వెంటనే న్యాయమూర్తులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ మీదట రేవంత్ కోర్టువారిని క్షమాపణ కోరారు.
అయినా చంద్రబాబు ఇలాంటివాటన్నిటికి అతీతుడని పురందేశ్వరి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి గారు.. మీరు ఎందుకు మాట్లాడారు అనే అధికారం కోర్టుకు ఉందా అనేది ఆలోచించాలి అని ముక్తాయించారు. విద్యాధికురాలైన ఆమెకు, సుమారు తొమ్మిదేళ్లపాటు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆమెకు కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో తెలియదా?. గతంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి పన్నెండు వైద్య కాలేజీలను మంజూరు చేశారు. అందులో అక్రమాలు జరిగాయని కొందరు కేసు వేశారు. ఆ క్రమంలో ఆయనపై సుప్రీంకోర్టు కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను తొలగించాలని నేదురుమల్లి కోర్టును కోరినా అందుకు అంగీకరించలేదు.
చంద్రబాబుతో నిజానికి గతంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి అంత సత్సంబంధాలు ఏవీ లేదు. 2014లో కూడా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అప్పట్లో ఒంగోలు లేదా మరో సేఫ్ సీటును ఆమె ఆశించారు. కాని కుట్రపూరితంగా ఆమె గెలవలేని రాజంపేట లోక్ సభ స్థానాన్ని చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కలిసి కేటాయించారని అనేవారు. తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఎగవేయడంతో సహా పలుమార్లు చంద్రబాబు తీవ్రంగా అవమానించారనే బాధ పురందేశ్వరికి ఉండేది. ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు రాగానే ఆమె వేదికపైనుంచి దిగి వెళ్లిపోయారు. పలు చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఎక్కడ రాజీ కుదిరిందో కాని ఆమె పూర్తిగా మద్దతురాలైపోయారు.
తన చెల్లి కళ్లల్లో ఆనందం చూడడానికి గాను పురందేశ్వరి తన పరపతిని తగ్గించుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారో అందరికి తెలుసు. కొందరు న్యాయమూర్తులు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు. ఒక జడ్జి అయితే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నంతగా తనకు సంబంధం లేని అంశాలపై కామెంట్లు చేశారు. అయినా అప్పట్లో పురందేశ్వరికి కోర్టులు అలా మాట్లాడవచ్చా అన్న సందేహం రాలేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు ఈమె కూడా ఆనందం చెందారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మాట మార్చేశారు. నాలుక మడతేశారు. తను ఎందుకు దీక్ష చేసింది తొలుత చెప్పినదానికి, ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినదానికి సంబంధం లేదు. ఆపసోపాలు పడుతూ పవన్ కళ్యాణ్ కాలినడకను తిరుమల వెళ్లినా, చంద్రబాబు పాపంలో ఆయనకు కూడా వాటా ఉండక తప్పదని చెప్పాలి.
- కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment