తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం సృష్టించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు వంత పాడిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అదే భజన చేసిన ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదలైనవి తాము తీసిన గొయ్యిలో తామే పడ్డట్టుగా అయింది. మాజీ ముఖ్యమంత్రిపైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పైనా బురద చల్లాలన్న తాపత్రయంతో, దురుద్దేశంతో వీరంతా కలిసి చేసిన కుట్ర బహిర్గతమవుతోంది. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చర్చను వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈనాడు, ఆంధ్రజ్యోతిలు స్వరం మార్చి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న వార్తల బదులు ఇంకేవేవో కథనాలు ఇస్తూ పాఠకుల్ని దారి మళ్లించాలని ప్రయత్నిస్తోంది. వివాదం మొదలైన మొదటి రెండు రోజులపాటు రెచ్చిపోయి కథనాలు గుప్పించిన వీరు సోమవారం నుంచి రివర్స్‌లో వెళుతున్నారు. ఇందుకు కొన్ని స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలించిన 2014-19 టైమ్‌లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం రూ.300 కంటే తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేసినట్లు స్పష్టం కావడం ఒకటైతే.. నేతికన్నా ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ వంటివి అధిక ఖరీదు కలిగినవని వెల్లడి కావడం ఇంకో కారణం.
ఈ ఏడాది జులైలో ఏఆర్ కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి మిగతావి అనుమతించారు. ఈవో శ్యామలరావు ఏమో కల్తీ నెయ్యిని వాడలేదని చెబితే, వాడేశారని చంద్రబాబు వాదించారు. ఇదే నిజమైతే ఆయన నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యులవుతారు కదా. ఆయన్ను వెంటనే పదవి నుంచి తప్పించాలి కదా? సస్పెండ్ చేయాలి కదా? అలాగే నెయ్యిలో కల్తీ ఉన్నప్పటికీ లోపలికి అనుమతించిన ఇతర అధికారులపై వేటు వేయాలి కదా? ఏఆర్ కంపెనీపై కేసు వేయాలి. ఇవేవీ చేయకుండా రెండు నెలలపాటు కథ నడిపి వందరోజుల పాలన సందర్భంగా ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని నీచమైన ఆరోపణ చేయడమేంటి? చంద్రబాబు ఇక్కడే దొరికిపోయారు. కాకపోతే తన మీడియా మద్దతుతో రెండు మూడు రోజులు దబాయించగలిగారు అంతే. ఒక అబద్ధాన్ని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడారు.
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అంగీకరిస్తున్నట్టు చెప్పకపోవడం, సిట్ అంటూ కొత్త నాటకానికి తెరతీయడం, మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయడం, అందులో చంద్రబాబుపై నిర్దిష్టమైన ఆరోపణలు చేయడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వతంత్ర విచారణ కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం ఎదుట ప్రమాణం చేస్తుంటే పోలీసులు అడ్డుపడిన తీరు కూడా సందేహాలకు తావిస్తోంది. సుబ్బారెడ్డి విసిరిన సవాలుకు చంద్రబాబు ముందుకొచ్చి ప్రమాణం చేయకపోవడం అనుమానం కలిగించే అంశమే. పదకొండు రోజులు దీక్ష చేస్తానన్న పవన్ కల్యాణ్ రెండో రోజే తన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. అంటే ఆయన కూడా ఇందులో నిజం లేదన్న భావనకు వచ్చి ఉండాలి. వీటన్నిటి రీత్యా చంద్రబాబు అండ్ కో తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టయిందన్న భావన కలుగుతోంది.
కోట్లాది మంది హిందువుల, తిరుమలలేశుని భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే దెబ్బతీశారన్న విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. కొందరు నిపుణులు చెబుతున్న ప్రకారం ఎన్డీడీబీకి తిరస్కృత నెయ్యి శాంపిల్స్ పంపినప్పుడు దాన్ని సరఫరా చేసిన కంపెనీ వారికి కూడా ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చేసినట్టు కనిపించడం లేదు. అలాంటప్పుడు టెస్టింగ్‌కు ఆ కంపెనీ నమూనాలే పంపారన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించవచ్చట. ఏఆర్ కంపెనీకి టీటీడీ ఇచ్చిన నోటీసులో విజిటబుల్ ఫాట్ ఉందని చెప్పడం గమనార్హం. చంద్రబాబు చెబుతున్నట్లు జంతువుల కొవ్వు కల్తీ జరిగి ఉంటే అదే విషయాన్ని నోటీసులో ప్రస్తావించాలి కదా!. అంటే చంద్రబాబు చెప్పింది తప్పే అవుతుంది కదా!. గతంలో చంద్రబాబులో టైమ్‌లోగానీ, ఆ తర్వాత వైఎస్ జగన్ సమయంలోగానీ ఇలా నెయ్యి ట్యాంకర్లను నాణ్యత సరిగా లేదని తిరుపతిలో జరిగే పరీక్షల్లో తేలితే వెనక్కి పంపించే వారు. ప్రత్యేకంగా ఏ ఎన్డీడీబీకో, మరొక సంస్థకో పంపి పరీక్షలు జరిపేవారు కాదు. అలాంటప్పుడు ఏఆర్ కంపెనీకి సంబంధించి శాంపిల్స్‌నే ఎందుకు గుజరాత్ దాకా పంపించారనే ప్రశ్న వస్తోంది. పోనీ ఎన్డీడీబీ వారైనా నిర్దిష్టంగా ఫలానా కల్తీ జరిగిందని చెప్పారా? లేదు. అటువంటప్పుడు జంతు కొవ్వు కల్తీ జరిగిందని, దానిని లడ్డూలలో వాడారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు?.
మంత్రి లోకేష్ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని చెబుతుంటే తండ్రి చంద్రబాబు వాడారని చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజం? గతంలో రివర్స్ టెండర్లు ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు తాజాగా అదే పద్ధతిలో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను ఎందుకు కేటాయించరన్న ప్రశ్న కూడా వస్తోంది. అందుకే ఈ కంపెనీకి ఫేవర్ చేయడం కోసం, ఏఆర్ కంపెనీని తప్పించడానికి నెయ్యిలో జంతువు కొవ్వు అవశేషాలున్నాయనే ఆరోపణ తెరమీదకు తెచ్చారన్న విమర్శలు వస్తున్నాయి. గత నెలలో పిలిచిన టెండర్లలో నందిని సంస్థ కిలో నెయ్యి రూ. 470కి కోట్ చేయగా ఢిల్లీలోని ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ రూ. 530కు కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. ఆ తర్వాత కారణమేమైనాగానీ రివర్స్ టెండర్ లోకి వెళ్లారు. నిజానికి ఈ సిస్టమ్‌లో రివర్స్ టెండర్ కు అవకాశం లేదట. ఈ సారి ఆల్ఫా కంపెనీ రూ. 450, నందిని రూ. 470 కోట్ల చేశాయి. ఈ టెండర్లో ఆల్ఫాకు 65 శాతం నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. నందిని సంస్థ వివాదం లేవనెత్తకుండా ఉండాలనే వారికి కూడా కేటాయించారు.
ఇక్కడ విషయం ఏమిటంటే కిలో నెయ్యి రూ. 1000 నుంచి రూ. 1500 లదాకా ఉంటే మరిప్పుడు ఆ రెండు సంస్థలు చంద్రబాబు చెబుతున్న థియరీ ప్రకారం ఇంత తక్కువ ధరకే ఎలా కోట్ చేశారన్నదానికి ఆయనే సమాధానం చెప్పాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని, ఆయన అసత్యాలకు ఒక చరిత్ర వుందని కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. మతపరమైన వివాదాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధికి చంద్రబాబు ప్రయత్నించారనే విషయం స్పష్టంగా కనపడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్న చంద్రబాబు ఐదేళ్లు పాలించలేడని సుబ్రహ్మణ్యంస్వామి అంటున్నారు. మామూలుగానైతే ఇంత ఘోరమైన అపచారానికి పాల్పడ్డ వ్యక్తి పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్ వస్తుంది. చంద్రబాబు తాను సృష్టించుకున్న సుడిగుండం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment