‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది | Kommineni Comments On Chandrababu Politics On Tirumala Laddu | Sakshi
Sakshi News home page

‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది

Published Tue, Sep 24 2024 12:33 PM | Last Updated on Tue, Sep 24 2024 5:58 PM

Kommineni Comments On Chandrababu Politics On Tirumala Laddu

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా రెచ్చిపోతూ ఉన్నవి లేనివి అన్నీ కలిపి విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో తన గురించి తాను పొగుడుకుంటూ ఏకంగా తాను దేవుడి ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడుతుండడం సంచలనంగా ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ నెయ్యితో తయారవుతోందని దారుణంగా వ్యాఖ్యానించారు. విశేషమేమిటంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కల్తీ వ్యవహారం జరిగినప్పటికీ ఆయన వ్యూహాత్మకంగా వైఎస్సార్‌సీపీపైనా, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామే తనతో నిజాలు చెప్పించారని ఆయన వెల్లడించడం పరాకాష్టగా భావించాలి. మామూలుగా కొంతమంది అతితో ఉండే  భక్తులు, పూనకం వచ్చినవారు, భవిష్యత్తు వాణి చెబుతామనేవారు.. అటువంటివాళ్లే తాము దేవునికి ప్రతినిధులుగా, దేవుడే మాట్లాడిస్తున్నామని చెబుతుంటారు. చంద్రబాబును ఆ మాట అనలేముగానీ, ఆయన మాట్లాడిన తీరు చూస్తే అలా అనిపించే అవకాశముంది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలన్న తాపత్రయంలో తానేమి మాట్లాడుతన్నారో ఆయన తెలుసుకోలేకపోతున్నారు. అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఈయన, తిరుమలకు అపచారం కలిగించేలా తిరుమలేశుడిపై అపనమ్మకం పెరిగేలా దుష్ప్రచారం చేశారు. పైగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతున్నదని ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి మఠాధిపతులతో మాట్లాడతానని చెబుతున్నారు. హిందువులను రెచ్చగొట్టడంతో పాటు, తిరుమల ప్రసాదం లడ్డూ వివాదాన్ని మరి కొంతకాలం కొనసాగించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ఆయన దురుద్దేశంగా కనిపిస్తోంది.

జూన్ 4న ఆయన అధికారంలోకి వచ్చారు. జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మొత్తం అధికార యంత్రాంగమంతా 4వ తేదీ నుంచే ఆయన అధీనంలోకి వెళ్లింది. జులై నెలలో నాణ్యతలేని ట్యాంకర్లను వెనక్కి పంపించడం ఆ తర్వాత నివేదిక తెప్పించడంవంటివి జరిగాయి. నాణ్యత లేని టాంకర్లను వెనక్కి పంపించామని, ఈఓ చెబితే, అబ్బేబ్బే.. లేదు.. ఆ నెయ్యిని లడ్డూలలో వాడారని చంద్రబాబు అంటున్నారు. అది నిజమే అయితే ఇలాంటి చర్యకు పాల్పడ్డ ఈఓని, ఇతర సంబంధిత అధికారులను చంద్రబాబు సస్పెండ్ చేయాలి కదా?. కేసులు పెట్టాలి కదా? ఏదో మతలబు లేనిదే చెన్నైలో ల్యాబ్‌లు అందుబాటులో వుంటే గుజరాత్‌కు పనిగట్టుకొని ఎందుకు పంపించారు? ఎన్డీడీబీ ఎండీ తిరుమల ఈవోను, మరికొంత మంది ప్రముఖులను ఎందుకు కలిశారు? ఆ తర్వాతనే ఈ టెస్టుల తతంగం జరగడంలోని ఆంతర్యం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

విశేషమేమిటంటే చంద్రబాబు నిజాలు చెబుతారా లేదా అన్నదానిపై గత మూడున్నరదశాబ్దాలుగా ప్రజల్లోగానీ, రాజకీయవర్గాల్లో గానీ చర్చజరుగుతోంది. చంద్రబాబుతో స్వామివారు సైతం నిజం చెప్పించలేరని కొంతమంది చమత్కరిస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో, విభజిత ఏపీ అసెంబ్లీలోగానీ పలువురు ఈ అంశం గురించి మాట్లాడుతూ చంద్రబాబు అలవోకగా అబద్ధాలు ఆడుతుంటారని వ్యాఖ్యానిస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో శాసనసభలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పగలరని, నిజం మాట్లాడితే తల వక్కలవుతుందనే మునిశాపం ఆయనకు వుందని ఎద్దేవా చేసేవారు. అప్పటినుంచీ ఈ డైలాగు బాగా ప్రసిద్ధిగాంచింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు రాజకీయంగా గానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల విషయంలోగాన మాట మార్చడం, అబద్ధాలు చెప్పడం సర్వసాధారణం అన్న అభిప్రాయం నెలకొంది.

ఉదాహరణకు ఉమ్మడి అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టెండర్‌కు సంబంధించి వైఎస్సార్ హయాంలో ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. చర్చకు నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో మొదట వేయికోట్లని రాసి, పదమూడు వందల కోట్లుగా మార్చారు. ఆ విషయాన్ని చీఫ్‌ విప్‌గా వున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి లేవనెత్తారు. దానికి చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఇచ్చిన ఏంటంటే తాము కావాలనే సంఖ్యను మార్చామని చెప్పారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చంద్రబాబుపై విరుచుకుపడి ఆయన గుణమే అంత అని ధ్వజమెత్తారు.  అసెంబ్లీలో బాగా రభస అయింది. చంద్రబాబు చేసిన తప్పునకు టీడీపీతో పాటు సీపీఐ, సీపీఎం పక్షాల సభ్యులు తల పట్టుకున్నారు.

డెయిరీ రంగంలో సొంతంగా హెరిటేజ్‌ పరిశ్రమను కలిగిన చంద్రబాబు 320కే నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పాల నుంచి కేవలం నెయ్యే కాకుండా పాలను ఇతర ఉత్పత్తుల అమ్మకం ద్వారా లోటును కవర్ చేసుకుంటారన్న సంగతి ఈయనకు తెలియదా? పోనీ ఇది తక్కువ ధర అనుకున్నా ఆయన పాలించిన 2014-19 మధ్య కిలో నెయ్యి 276కే మహారాష్ట్రలోని గోవిందా పాల ఉత్పత్తుల కంపెనీకి ఎలా టెండర్‌ ఖరారు చేశారు? అంటే అప్పుడు కూడా కల్తీ జరిగిందని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా!

ఆనాడు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌కు ( నందిని) ఎందుకు టెండర్‌ను ఇవ్వలేదు. ఇలాంటివాటికి  ఏమీ సమాధానం ఇవ్వకుండా తనతో వెంకటేశ్వరస్వామి నిజాలు చెప్పించారని బుకాయిస్తే సరిపోతుందా?. తీరా చూస్తే ఆయన చెప్పినవి అసత్యాలేనని తేలుతోంది. ఆయన కుమారుడు లోకేషే కల్తీ నెయ్యితో ఉన్న టాంకర్లలోని సరుకు వాడలేదని ట్వీట్ చేశారు. దీంతో చంద్రబాబు నిజం చెప్పలేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆనాడు టిటిడి ఏర్పాటు చేసిన ధరల కమిటీలో ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా వున్న పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డి వున్నారు. వీరిద్దరూ ఆ రోజుల్లో వైఎస్సార్‌సీపీకి చెందినవారు. తదుపరి అంటే 2024లో టీడీపీలోకి వచ్చారు. మరి వీరిని ఇప్పుడు టీటీడీలో అవకతవకలకు బాధ్యులని చెప్పి తప్పించగలరా?

అలాగే బీజేపీకి చెందని నేత వైద్యనాధన్ కూడా కమిటీలో వున్నారు. టీటీడీలో బీజేపీ సభ్యులుకూడా వున్నారని వైఎస్సార్‌సీపీ ప్రస్తావిస్తే దాన్ని బ్లాక్‌ మెయిల్ అని ఎల్లో మీడియా భాష్యం చెప్పడం విచిత్రంగా వుంది. అసలు విశేషం ఏమిటంటే నెయ్యి కన్నా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ చెబుతున్న పిష్ ఆయిల్, పిగ్  ఫాట్ వంటివాటి ఖరీదు చాలా ఎక్కువట. ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి ఆ వివరాలు చెబుతూ జంతు కొవ్వు వెయ్యి నుంచి 1400 రూపాయలు ఉంటే 320 రూపాయల ఖరీదుఉన్న నేతిలో ఎవరైనా కలుపుతారా? అని ప్రశ్నించారు. రాగిలో బంగారం కలుపుతారా?. బంగారంలో రాగి కలుపుతారా? పాలలో నీళ్లు కలుపుతారా . నీళ్లలో పాలు కలుపుతారా? అన్న అర్ధవంతమైన ప్రశ్న వేశారు. దీనికి చంద్రబాబు అండ్ కో ఏమి చెబుతారో చూడాలి.

ఆ విషయానికి వస్తే 1995లో ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్ని రకాలుగా మాటలు మార్చారో అందరికీ తెలిసిందే. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మసీదులు కూల్చేపార్టీగా అభివర్ణించారు. 2004లో ఓటమి తర్వాత జీవితంలో బిజెపితో పొత్తుపెట్టుకోనని అన్నారు. నరేంద్ర మోదీని నర హంతకునిగా ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోదీని హైదరాబాద్ రానీయనని హెచ్చరించేవారు. అయినా మళ్లీ 2014లో  మోదీ ఎక్కడుంటే అక్కడకు వెళ్లి బతిమలాడుకొని మరీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. 2018లో బీజేపీ నుంచి విడిపోయి మోదీని టెర్రరిస్టు, ముస్లింలను బతకనీయడు, పెళ్లాన్ని ఏలుకోలేనివాడు దేశాన్ని ఎలా ఏలుతాడు అని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. తిరిగి 2024 నాటికి మోదీ అంతటి గొప్పవాడు లేడని ప్రకటించాడు. మరి వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఏం చెప్పగలం.

సోనియా గాంధీని దెయ్యం , భూతం అని తిట్టారు. కానీ ఆ తర్వాత ఆమెతో కలిసి రాజకీయ సభల్లో పాల్గొని పొగిడారు. లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి ఆ తర్వాత దాన్ని నెరవేర్చకపోగా మొత్తం రుణమాఫీ చేశామని దబాయించేవారు. తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడే చంద్రబాబు మాటలు నిజాలా అబద్ధాలా అనేది పక్కన పెడితే, ఎలాగైనా మాట మార్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వైఎస్ జగన్ పై ఎదురు దాడి చేస్తూ ప్రధానికి లేఖ రాయడానికి  ఎంత ధైర్యమని ప్రశ్నించడం చిత్రంగా వుంది. వైవీ సుబ్బారెడ్డి భార్య పక్కా హిందువు అయితే ఆమెకు క్రైస్తవ మతం అంటగట్టి స్టేట్మెంట్ ఇచ్చారు.

మరో వైపు తన క్యాబినెట్‌లోనే హోంమంత్రిగా వున్న వ్యక్తి ఒకసారి తను  క్రిస్టియన్‌  అని, మరొకసారి హిందూమతం అని చెప్పుకున్నారు. భూమన కరుణాకర్‌ రెడ్డి తన కుమార్తె పెళ్లిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చేశారని చంద్రబాబు ఆరోపిస్తారు. మరో వైపు ఒక క్రిస్టియన్‌ను వివాహమాడి, పిల్లలకు సైతం క్రిస్టియన్ పేర్లనే పెట్టిన పవన్‌ కల్యాణ్‌ చాలా గొప్ప హిందువు అని సర్టిఫికెట్ ఇస్తుంటారు. చంద్రబాబు స్వయంగా క్రైస్తవ సమావేశానికి వెళ్లి ఏసుక్రీస్తును నమ్మినవారికి అపజయం లేదని సూక్తులు చెప్పారు. కానీ ఇప్పుడేమో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నిజానికి మతమన్నది వ్యక్తిగతం. కానీ చంద్రబాబు లాంటివారు తమ స్వార్ధ రాజకీయాల కోసం కులం, మతం, నిజాలతో సంబంధం లేకుండా వాడేసుకోగలరని అనిపిస్తుంది.

-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement