అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం | Purandeswari Political Future In Confusion After Assembly Elections Results 2024, Details Inside | Sakshi
Sakshi News home page

అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం

Published Tue, May 21 2024 12:38 PM | Last Updated on Tue, May 21 2024 1:13 PM

Purandeswari Political Future In Confusion

ఎన్నికల వేళ పురందేశ్వరి పాత్రపై సీనియర్లు గుర్రు

ఏపీలో బీజేపీ బలహీనపడటానికి పురందేశ్వరే కారణమంటున్న సీనియర్లు

చిన్నమ్మ రాజకీయాలతో రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ

తారా స్థాయికి చేరుకున్న గ్రూపు రాజకీయాలు

చిన్నమ్మకి గెలిస్తేనే రాజకీయ భవితవ్యం

రాజమండ్రిలో ఓడితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలి నుంచి తప్పించే అవకాశం

ఎన్నికల తర్వాత అంతా గప్ చుప్

పురందేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమెకు ఎసరు తెచ్చిపెట్టనున్నాయా.. ఎన్నికల సమయంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిన పడిందని భావిస్తున్న సీనియర్లు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏపీ బీజేపీలో ఇపుడు గ్రూపు రాజకీయాలకి పురందేశ్వరి వైఖరే కారణమని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన సమయంలో ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పార్టీని బలి చేశారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. పురందేశ్వరి ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్‌కి బ్రేక్ పడినట్లేనా...

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా ఉంది. ఎన్నికల ఏడాదిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోశారు. అప్పటివరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని రెండు గ్రూపులుగా మార్చేసారు. ఏపీలో గడిచిన మూడేళ్లగా సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్ధాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా నిత్యం ప్రజలలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేవారు.

అయితే పురందేశ్వరి గత ఏడాది ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నుంచి బీజేపీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని కావాలని మార్పు చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలని తొలగించి మరీ తన సొంత టీంని నియమించుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బీజేపీ, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించిన నేతలు. .ఆ దిశగానే ప్రయత్నించారు.

జనసేన.. టీడీపీతో కలిసిన తర్వాత ఒంటరి పోరు వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉండాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని.. అందు కోసం ఒంటరిపోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఎలో చేరడం వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సొంతపార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాదాన్యతనిచ్చారనేది జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.

చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్‌ని ఢిల్లీకి తీసుకెళ్లి హోంమంత్రి అమిత్ షాని కలిపించడం వెనుక పురందేశ్వరే ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం.. టిక్కెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్లుగానే జరిగాయని విమర్శలున్నాయి. గత నాలుగన్నరేళ్లగా క్షేత్రస్ధాయిలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురందేశ్వరి మాట్లాడకపోవడం ఏపీ బీజేపీకి మైనస్‌గా మారింది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కనీసం 25 అసెంబ్లీ స్ధానాలు, ఎనిమిది పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా సంప్రదింపులు చేయాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.

అయితే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే మైకంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఏపీ బీజేపీలో పరిస్ధితులని పట్టించుకోలేదు. .ఇదే సమయంలో టీడీపీతో పొత్తులో భాగంగా పురందేశ్వరి చంద్రబాబు ఆశించినట్టుగా వ్యవహరించి కేవలం ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ స్ధానాలకి పరిమితం చేశారు. ఆ తర్వాతైనా బీజేపీ పట్టున్న స్ధానాలను కోరుకుందా అది కూడా లేదు.. బీజేపీ ఓడిపోయే స్ధానాలను బిజెపికి అండగట్టినా కూడా ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి పెదవి విప్పలేదు... సరికదా తనకు ఎంపి టిక్కెట్ వస్తే చాలని ఊరుకున్నారు.దీనికి తోడు బిజెపితో పొత్తుకు ముందే కొన్ని స్ధానాలను టిడిపి ప్రకటించడం కూడా ఎపి బిజెపిలో మొదట నుంచి నేతలకి నచ్చలేదు.. బిజెపిలో మొదటి నుంచి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని...బిజెపి గెలిచే స్ధానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తీ నోరూ బాదుకున్నా కూడా పురందేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఎపి బిజెపి భవితవ్యాన్ని పూర్తిగా చిదిమేశాయి

విశాఖపట్టణం ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు చివరి వరకు ప్రయత్నించారు.బిజెపి జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఇల్లు కొనుక్కుని ఆ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం కావడానికి మూడేళ్లకి పైగా కృషి చేసిన జివిఎల్ ఆ స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పురందేశ్వరి కనీసం టిడిపి, బిజెపి ఉమ్మడి చర్చలలో విశాక సీటుని కనీసం ప్రస్తావించలేదని తెలుస్తోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందని..ఆ సీటు బిజెపికి ఇవ్వాలని పురందేశ్వరి గట్టిగా పట్టుపట్టకపోవడంతోనే ఆ సీటు టిడిపి తీసుకుందని చెబుతున్నారు.కేవలం తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్ధల చైర్మన్ భరత్ కోసమే జివిఎల్ కి టిక్కెట్ రాకుండా చేశారని చెబుతున్నారు.

ఆ తర్వాత విజయనగరం లేదా అనకాపల్లి కోసం జివిఎల్ ప్రయత్నించినా కూడా అవి కూడా దక్కలేదు.దీంతో జివిఎల్ పురందేశ్వరి వైఖరిపై అలిగి ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.ఇక అనకాలపల్లి ఎంపి స్ధానంపై మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకుంటే ఆయనని కాదని కడప నుంచి సిఎం రమేష్ కి టిక్కెట్ ఇప్పించారు.ఇది కూడా చంద్రబాబు డైరక్టన్ లో జరిగిందని బిజెపి సీనియర్లు విమర్శిస్తున్నారు.ఉత్తరాంద్రలో ఉన్న బిసి నేతలకి అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ కి టిక్కెట్ ఇవ్వడం ఉత్తరాంద్ర బిజెపిలో వివాదం రాజేసింది. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సిఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఉత్తరాంద్ర బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.ఇక రాజమండ్రి స్ధానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. రాజమండ్రిలోనే పుట్టి నాలుగన్నర దశాబ్ధాలగా బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి టిక్కెట్ ఆశిస్తే పురందేశ్వరి చక్రం తిప్పి టిక్కెట్ ఆమె దక్కించుకున్నారు.

ఇక సోము వీర్రాజుని అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించినా ఓడిపోయే స్ధానంలో పోటీచేయలేనని తిరస్కరించారు.ఇక ఏలూరు స్ధానం కోసం దశాబ్ధకాలంగా బిజెపిలో పనిచేస్తున్న తపనా చౌదరికి కూడా టిక్కెట్ ఇప్పించడంలో పురందేశ్వరి విఫలమయ్యారు.ఈ సీటుని బిజెపికి ఇవ్వకుండా టిడిపి తీసేసుకుని కడప జిల్లాకి చెందిన యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ని రంగంలోకి దింపారు. ఇక హిందూపూర్ ఎంపి కానీ కదిరి అసెంబ్లీ కానీ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు.ఇలా వరుసగా పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలగా రాజకీయాలు చేసిన సీనియర్లెవరకి కూడా టిక్కెట్లు దక్కలేదు కానీ టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకి టిక్కెట్లు దక్కడం సీనియర్లకి తీవ్ర నిరాశ కలిగించింది.దీంతో పాటు అనపర్తి టిక్కెట్ విషయంలో మాజీ సైనికుడికి అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం...బద్వేలులో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి నేతని పక్కన పెట్టి టిడిపి ఇన్ చార్జి రోషన్ ని ముందు రోజు బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం బిజెపిలో తీవ్ర వివాదాస్పదమైంది.

అలాగే ఎన్నికలకి ముందు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ని బిజెపిలో చేర్చుకుని తిరుపతి ఎంపి టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీలో వ్యతిరేకత తెచ్చింది.ఇలా ఉద్దేశపూర్వకంగా బిజెపిలో మొదట నుంచి పనిచేసిన నేతలని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి టిక్కెట్లు ఇవ్వడం వెనుక పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చే బదులు ఆ సీట్ల స్ధానంలో బిజెపి వేరే సీట్లని తీసుకోవాలని... దీని వల్ల బిజెపి నష్టపోతోందంటూ మాజీ సిఎం బిజెపి సీనియర్ నేత ఐవిఆర్ కృష్ణరావు పలుమార్లు ట్విట్లర్ వేదికగా ప్రశ్నించారు. ఇలా పురందేశ్వరి పెట్టిన చిచ్చుతో ఎన్నికల సమయంలో ఎపి బిజెపి రెండుగా చీలిపోయింది.ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడానికి పురందేశ్వరి వైఖరే ప్రధానకారణంగా తెలుస్తోంది.

ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడా సొంత టీం నే ఏర్పాటు చేసుకున్నారు.స్ధానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురందేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడానికి పురందేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు స్ధానంలో రాజమండ్రి టిక్కెట్ దక్కించుకున్న పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కూడా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం...ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో కట్టిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల వేళ పురందేశ్వరి ప్రత్యేకంగా వేరే చోట ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాయాలన్ని కాకుండా ప్రైవేట్‌గా వేరేచోట ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలను రాజేసింది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని.. సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను పురందేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు.

ఇలా వరుస తప్పిదాలతో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఒకవర్గం పురందేశ్వరి అనుకూలంగా ఉంటే...మరొక వర్గం పురందేశ్వరిని వ్యతిరేకిస్తోందంటున్నారు.ఇలాంటి పరిణామాలు గతంలో ఎపుడూ ఏపీ బీజేపీలో చోటుచేసుకోలేదని.. కేవలం పురందేశ్వరి వైఖరి కారణంగానే బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని అంటున్నారు.ఇపుడా గ్రూపు రాజకీయాలే పురందేశ్వరికి ఎసరు తెచ్చేలా కన్పిస్తున్నాయంటున్నారు.రాజమండ్రితో పాటు బిజెపి పోటీ చేసిన మొత్తం ఆరు ఎంపి స్ధానాలు, పది అసెంబ్లీ స్ధానాలలో కనీసం సగం సీట్లైనా బిజెపి గెలిస్తేనే పురందేశ్వరి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంధి ఉండకపోవచ్చునంటున్నారు. కానీ బిజెపి గెలుపొందే స్ధానాలను కాకుండా ఓడిపోయే స్ధానాలను తీసుకునే ఓటమిని ముందే డిసైట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు మాట తర్వాత కనీసం పురందేశ్వరి అయిన రాజమండ్రిలో గెలుస్తోందో లేదోనేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రాజమండ్రిలో పురందేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆమె ఓడిపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షరాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇప్పటికే ఎన్నికల సమయంలో పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. ఇలా వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఆమె ఓడిపోతే శాశ్వతంగా పురందేశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ధకాలం పాటు ఎంపిగా.. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హవా ఆమెకు కలిసివచ్చిందని.. ఇపుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవితవ్యాన్ని సమాది చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ గప్ చుప్‌గా ఉంది.. నేతలెవరూ కూడా ఎన్నికల తర్వాత పెదవి విప్పడానికి సాహసించడం లేదు.. గెలుపుపై నమ్మకం లేక ఏ నేతా కూడా మీడియా ముందుకురావడానికి ఇష్టపడకపోవడం ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయంటున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement