
పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి
లెట్స్ ఓట్ సంస్థ కృషి అభినందనీయం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
ఓటింగ్ శాతం 79 నుంచి 82కు తీసుకెళ్తాం
గుంటూరు వెస్ట్: యువ ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కోరారు. ఓటు హక్కు మాత్రమే కాదని అంతకు మించిన బాధ్యతగా భావించాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థతో కలసి శనివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో యువ ఓటర్ల కోసం 3కే వాక్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ 18–19 ఏళ్ల మధ్య ఉన్న అర్హులైన యువత రాష్ట్రంలో 10.30 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇది శుభపరిణామమన్నారు.
వీరంతా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటింగ్ శాతం 79 అని తెలిపారు. దీన్ని 82 శాతానికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ కొన్నిచోట్ల తక్కువగా ఉందన్నారు. పరిశ్రమల యజమానులతోపాటు వ్యాపారసంస్థలను సంప్రదిస్తున్నామని, ఆ రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, జీతం మాత్రం కట్ చేయవద్దని చెబుతున్నామని వివరించారు. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థ తీసుకున్న చొరవ చాలా గొప్పదని ప్రశంసించారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరు మే 13వ తేదీ ఓటు వేసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, లెట్స్ ఓట్ సంస్థ కన్వీనర్ మాలకొండయ్య జెండా ఊపి 3కే వాక్‌ను ప్రారంభించారు. ఆర్డీవో పి.శ్రీకర్, డీఆర్వో పెద్ది రోజా, లెట్స్ ఓట్ సంస్థ గుంటూరు చాప్టర్ కోఆరి్డనేటర్ టి.బాలాజీశ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment