హోమ్ ఓటింగ్ కావాలనుకుంటే ముందుగా ఫాం 12డీ ఇవ్వాలి
ఇంటివద్దే ఐదుగురు పోలింగ్ సిబ్బందితో ఓటు నమోదు
మొత్తం ప్రక్రియ వీడియోతో రికార్డు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా మన రాష్ట్రంలో కల్పిస్తున్న ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కుపైన, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్‌స్టేషన్‌కు వచ్చిగానీ, ఇంటివద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సన్నద్ధత, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై సోమవారం సచివాలయం నుంచి మీనా జిల్లాల ఎన్నికల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా రిటర్నింగ్ ఆఫీసరుకు ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఒకసారి ఇంటివద్ద నుంచే ఓటువేసే అవకాశం పొందితే వారు నేరుగా పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతారన్న విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునేవారి కోసం వీడియో గ్రాఫర్‌తో, అయిదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వివిధ శాఖల ఉద్యోగులు, సర్వీసు ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి రిటర్నింగ్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సీఈవో ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment