పంజాబ్ కింగ్స్ సంచలనం
262 లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం
టి20 చరిత్రలోనే ఇదే అత్యధికం
8 వికెట్లతో ఓడిన కోల్‌కతా
బెయిర్‌స్టో అజేయ సెంచరీ
శశాంక్ మెరుపు ఇన్నింగ్స్
37 ఫోర్లు... 42 సిక్సర్లు... ఇరు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు... ఈడెన్ గార్డెన్స్ పరుగుల వరదతో తడిసి ముద్దయింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో భారీ స్కోర్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో మ్యాచ్‌లో ‘రన్’రంగం కొనసాగింది ... అయితే ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే కాకుండా రెండో టీమ్ కూడా అంతే బదులుగా జవాబిచ్చింది.
ఫలితంగా టి20 చరిత్రలోనే రికార్డు ఛేదనతో మ్యాచ్ ముగిసింది... పేలవ ఆటతో వెనుకబడి ఒక్క విజయం కోసం తపిస్తున్న పంజాబ్ కింగ్స్ అసాధారణ బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించడమే పెద్ద విశేషం.
సొంతగడ్డపై 261 పరుగులు చేసి కోల్‌కతా నిశ్చింతగా నిలబడగా... తామూ తగ్గమంటూ రెచ్చిపోయిన కింగ్స్ మరో 8 బంతులు ఉండగానే 262 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. వరుస వైఫల్యాల తర్వాత మెరుపు సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో, యువ ఆటగాడు శశాంక్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ హీరోలుగా నిలిచారు.
కోల్‌కతా: పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత అత్యద్భుత ప్రదర్శనతో ఆ జట్టు కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.
ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు సాధించి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అసాధ్యంగా అనిపించిన లక్ష్యాన్ని ఛేదించి చూపించారు.
శతక భాగస్వామ్యం...
సొంత మైదానంలో కోల్‌కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. టోర్నీలో తమ ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్లు సాల్ట్, నరైన్ మరోసారి మెరుపు వేగంతో జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరి ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు చేసింది.
7 ఓవర్లలోపే 3 క్యాచ్‌లు వదిలేసిన పంజాబ్ ప్రత్యర్థికి సహకరించింది. ఈ క్రమంలో నరైన్ 23 బంతుల్లో, సాల్ట్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 137/0 కాగా... ఎట్టకేలకు 11వ ఓవర్లో పంజాబ్ తొలి వికెట్ పడగొట్టగలిగింది.
ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కూడా నైట్‌రైడర్స్ జోరు తగ్గలేదు. వెంకటేశ్ దూకుడుగా ఆడగా... రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ (10 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా ధాటిని ప్రదర్శించారు. దాంతో 15.2 ఓవర్లలో స్కోరు 200 పరుగులకు చేరింది. చివరి 5 ఓవర్లలో కేకేఆర్ 71 పరుగులు సాధించింది.
వీర విధ్వంసం...
ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, బెయిర్‌స్టో కూడా చెలరేగారు. ప్రభ్‌సిమ్రన్ ఒకదశలో 10 బంతుల వ్యవధిలో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. 18 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అనుకూల్ వేసిన ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా 4, 6, 4, 4, 6తో చెలరేగాడు. వీరిద్దరు 36 బంతుల్లో 93 పరుగులు జోడించిన తర్వాత తొలి వికెట్ తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందింది.
అయితే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తర్వాత బెయిర్‌స్టో మరింత ధాటిగా ఆడాడు. కొద్దిసేపు రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. ఆరు వరుస ఇన్నింగ్స్‌లలో వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో శతకాన్ని చేరుకున్నాడు. మరోవైపు శశాంక్ ఎక్కడా తగ్గకుండా సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.
చమీరా ఓవర్లో అతను కొట్టిన 3 సిక్సర్లతో పంజాబ్ విజయానికి చేరువైంది. ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాల్సి ఉండగా... హర్షిత్ వేసిన 18వ ఓవర్లోనే శశాంక్ 3 సిక్స్‌లు, ఫోర్ బాదగా 25 పరుగులు రావడంతో పంజాబ్ గెలుపు లాంఛనమే అయింది. బెయిర్‌స్టో, శశాంక్ మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జత చేశారు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) స్యామ్ కరన్ 75; నరైన్ (సి) బెయిర్‌స్టో (బి) చహర్ 71; వెంకటేశ్ అయ్యర్ (రనౌట్) 39; రసెల్ (సి) హర్షల్ (బి) అర్‡్షదీప్ 24; శ్రేయస్ (సి) రబడ (బి) అర్‡్షదీప్ 28; రింకూ సింగ్ (సి) అశుతోష్ (బి) హర్షల్ 5; రమణ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–138, 2–163, 3–203, 4–246, 5–253, 6–261. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–60–1, అర్‡్షదీప్ 4–0–45–2, హర్షల్ 3–0–48–1, రబడ 3–0–52–0, రాహుల్ చహర్ 4–0–33–1, హర్‌ప్రీత్ 2–0–21–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 54; బెయిర్‌స్టో (నాటౌట్) 108; రోసో (సి) శ్రేయస్ (బి) నరైన్ 26; శశాంక్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 2 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–93, 2–178. బౌలింగ్: చమీరా 3–0–48–0, హర్షిత్ 4–0–61–0, అనుకూల్ 2–0–36–0, నరైన్ 4–0–24–1, వరుణ్ 3–0–46–0, రసెల్ 2–0–36–0, రమణ్‌దీప్ 0.4–0–9–0.
262 టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా (259/4; వెస్టిండీస్‌పై మార్చి 26న, 2023లో) జట్టు పేరిట ఉంది.
42 ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ గుర్తింపు పొందింది. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 38 సిక్స్‌లు వచ్చాయి.
24 ఐపీఎల్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ఈ సీజన్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 22 సిక్స్‌లు చొప్పున కొట్టింది.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X ముంబై (మ. 3:30 నుంచి)
లక్నో ్ఠX రాజస్తాన్ (రాత్రి 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment