దీనిపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రతిపక్షాల కుట్ర
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేని ఈ చట్టంపై దిగజారుడు రాజకీయం చేయడం దుర్మార్గం
14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇంత అసహ్యంగా మాట్లాడటానికి నోరెలా వచ్చిందో
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
అవనిగడ్డ: ల్యాండ్ టైట్లింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చట్టమని, రాష్ట్రంలో ఇంకా అమల్లోకి రాని ఈ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు ఏమీ దొరక్క, ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఈ చట్టంపై దిగజారుడు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
సీఎం వైఎస్ జగన్‌లో ఎలాంటి లోపాలు కనబడకపోవడంతో ఈ చట్టం అమలైతే జగన్‌మోహన్‌రెడ్డి మీ భూములన్నింటినీ తాకట్టు పెట్టుకుంటారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనుకునే వారు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అయినా ఇలా చేస్తుందా, అలా చేస్తే వ్యవస్ధ నడుస్తుందా అన్నారు. ప్రజల మెదళ్లలో విషం ఎక్కించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయర్టీని విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని గొప్పలు చెప్పుకునే బాబు అంత అసహ్యంగా మాట్లాడటానికి నోరెలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.
మోసగించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సమగ్ర భూ సర్వే సాహసోపేతమైన చర్య అని.. 6 వేల గ్రామాల్లో ప్రయోగాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం పూర్తిస్ధాయిలో అమల్లోకి వస్తే రాష్ట్రంలో భూములకు సంబంధించి వివాదాలు, ఎలాంటి గొడవలు ఉండవని చెప్పారు.
వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు చెబుతున్న మాటలు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవుతున్న విషయం తెలిసి చంద్రబాబు ఎంత ఆందోళనకు గురవుతున్నారో ఆయన మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వందేళ్ల నుంచి ఉన్న భూ సమస్యను పరిష్కరించారని, లక్షలాది ఎకరాల్లో చుక్కల భూముల అంశాన్ని పరిష్కరించారన్నారు.
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ దు్రష్పచారాన్ని ప్రజలు నమ్మొద్దని, 10 రోజుల తరువాత టీడీపీ, జనసేన మైకులు, వాళ్ల నోళ్లు మూగబోతాయని జోస్యం చెప్పారు. మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, రైతు విభాగం జోనల్ ఇన్‌చార్జి కడవకొల్లు నరసింహారావు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, నియోజవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, పార్టీ మండల కన్వి నర్ రేపల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment