జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌

Published Sun, Apr 7 2024 7:15 AM

-

ఇబ్రహీంపట్నం రూరల్‌: లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే జర్నలిస్టులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని కలెక్టర్‌ శశాంక తెలిపారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ లోపు సంబంధిత శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం–12(డీ)లను మా త్రమే పరిగణలోకి తీసుకొని పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. డీపీఆర్‌ఓ కార్యాలయం నుంచి పొందొచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఓటింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేదన్నారు. వారి పేరు వేరే జాబితాలో చేర్చబడుతుందని తెలిపారు.

తాగునీటి ఎద్దడి

లేకుండా చూడండి

జిల్లా ప్రత్యేకాధికారి విజయేంద్ర బోయ

ఇబ్రహీంపట్నం రూరల్‌: తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర రోడ్డు రవాణా, రోడ్లు భవనాల శాఖ స్పెషల్‌ సెక్రెటరీ విజయేంద్ర బోయ అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్‌ శశాంకతో కలిసి తాగునీటి సరఫరాపై మున్సిపల్‌ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, మిషన్‌భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయేంద్ర బోయ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాగునీటి అంశం చాలా కీలకంగా మారిందన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన చోట చేతి పంపులు, బోర్ల మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్లు పెట్టి సరఫరా చేయాలని చెప్పారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేకాధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపీడీఓలు క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా తీరును నిత్యం పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ.. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య రాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. తాగునీటి కోసం మండలానికి ప్రత్యేకాధికారులను నియమించినట్టు తెలిపారు. కాల్‌ సెంటర్‌ 93474 92260కు ఫోన్‌కాల్‌, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేష్‌ మోహన్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, మున్సిపల్‌ కమిషనర్లు, వాటర్‌వర్క్స్‌ అధికారులు పాల్గొన్నారు.

మతోన్మాదం నుంచి

దేశాన్ని కాపాడుకుందాం

సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

ఇబ్రహీంపట్నం రూరల్‌: మతోన్మాదం నుంచి దేశాన్ని కాపాడుకుందామని, లౌకిక తత్వాన్ని బతికించుకుందామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం శనివారం పాషానరహరి స్మారక కేంద్రంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. భువనగిరి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉందన్నారు. ఇబ్రహీంపట్నం, నకిరేకల్‌, భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి, జనగాంలో తమ పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషించారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కలిగిన ఈ ప్రాంతంలో నేటికీ ఆ పోరాట వారసత్వం ఉందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పోరాటాలు చేశాయా అని నిలదీశారు. కార్మికులు, కర్షకులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాటం నిర్వహించారని, నేటికీ చేస్తూనే ఉన్నారని చెప్పారు. వామపక్షాల బలం ఉన్న కారణంగానే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించకున్నామన్నారు. పార్టీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి జహంగీర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే కమ్యూనిస్టులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్‌, పెసరగాల జంగారెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీరామ్‌ నాయక్‌, పగడాల యాదయ్య, జగదీశ్‌, సామెలు, సీహెచ్‌ జంగయ్య, శ్యాంసుందర్‌, అలంపల్లి నర్సింహ, ఈ.నర్సింహ, కె.జగన్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement