చల్లని వేళ కానిచ్చేద్దాం..! | Sakshi
Sakshi News home page

చల్లని వేళ కానిచ్చేద్దాం..!

Published Thu, May 9 2024 12:45 AM

చల్లని వేళ కానిచ్చేద్దాం..!

● ఉదయం, సాయంత్రమే ఎన్నికల ప్రచారం ● ప్రజాసమూహాల వద్దకు వెళ్లేలా కార్యాచరణ ● భానుడి భగభగతో జంకుతున్న పార్టీల నేతలు

ఖమ్మంమయూరిసెంటర్‌: లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మా రాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పని లేకుండా గంపగుత్తగా ఒకే చోట వందల సంఖ్యలో ఉండే ఓటర్లను కలిసేందుకే అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద యం భానుడి ప్రతాపం ప్రారంభమయ్యే లోగా.. సాయంత్రం వేడి తగ్గాక ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు. మిగతా సమయం పరిస్థితులను బేరీజు వేసుకుంటూ లోపాలను సరిచేసుకోవడంలో నిమగ్నమవుతున్నారు.

ఇంటింటి ప్రచారం అంతంతే..

అభ్యర్థులు, పార్టీల నాయకులు ఎక్కువగా ఇన్నాళ్లు రోడ్డుషోలు, కార్నర్‌ మీటింగ్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు. స్టార్‌ క్యాంపెయినర్లు వచ్చినా ఉదయం, సాయంత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక అభ్యర్థులు, నాయకులైనా సరే ఎక్కువ మంది ఉండే చోట్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అంతేతప్ప ఇప్పటివరకై తే ఇంటింటి ప్రచారం పెద్దగా చేయలేదనే చెప్పాలి. ఎండ సమయంలో బయటకు వెళ్లినా ఓటర్లను కలిసే పరిస్థితి లేకపోవడం.. సభలు, కార్నర్‌ మీటింగ్‌లు పెట్టినా వేడికి జన సమీకరణ కష్టమవుతోందనే భావనతో ఉద యం, రాత్రి ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రూపాయి ఖర్చు లేకుండానే..

ఎండలతో పార్టీల కార్యకర్తలు, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఓటర్లను కలిసేందుకు పార్టీల అభ్యర్థులు, నాయకులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. పెద్ద మొత్తంలో జనం ఉండే ప్రాంతాల్లోనే తమ ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పట్టణాలు, నగరంలో వేకువ జామున మైదానాల్లో వాకర్లను కలిసి ఓట్లు అభ్యర్థించడం కనిపిస్తోంది. గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్తే అక్కడ వందల సంఖ్యలో ఉన్న కూలీలను కలుస్తున్నారు. వీరిని కలిసి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పనిలో పనిగా తమను గెలిపించాలని కోరుతున్నారు. దీంతో పార్టీ అభ్యర్థికి రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం జరిగిపోతోంది. చల్లని వేళ మైదానాలు, పనిప్రదేశాలనే ఎక్కువగా ఎంచుకుని ఓటర్లను కలవడమే కాకుండా, జనసమీకరణ కూడా లేకుండా ప్రచారం ముగించేస్తున్నారు. అంతేకాక శుభ, అశుభకార్యాలు ఎక్కడ జరిగినా.. ఆహ్వానం అందినా, లేకున్నా అభ్యర్థులు, రాజకీయ నాయకులు వెళ్లి తమను తాము పరిచయం చేసుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

చల్లబడిన వాతావరణం

రెండు రోజులుగా గాలిదుమారం, వర్షంతో జిల్లాలో దాదాపు అన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లబడింది. ఇంతలో ప్రచారం ముగిసే సమయం కూడా ముగియవస్తోంది. దీంతో మిగిలిన తక్కువ సమయాన్ని ఇంటింటి ప్రచారానికి వినియోగించుకునేలా పార్టీల నాయకులు కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీల అగ్రనేతలు వచ్చివెళ్లడంతో జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకుల ఆధ్వర్యాన ఇంటింటి ప్రచారంపై ఫోకస్‌ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement