
ప్రపంచ క్రికెట్‌లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌ల్లో పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ ఇద్దరు జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే తొమ్మిదో ఎడిషన్‌లోనూ పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2007 నుంచి వరుసగా 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలో పాల్గొని ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో వీరిద్దరి ప్రస్తానం 17 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది.
ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్ అరంగేట్రం ఎడిషన్ (2007) సమయానికి క్రికెట్‌లో ఒనమాలు దిద్దుతుండేవాడు. ఇప్పుడు అదే హిట్‌మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. రోహిత్ ఇప్పటివరకు జరిగిన ఎనిమిది వరల్డ్‌కప్ ఎడిషన్లలో 39 మ్యాచ్‌లు ఆడి 34.39 సగటున, 127.88 స్ట్రయిక్‌రేట్‌తో 963 పరుగలు సాధించాడు. రోహిత్ ఖాతాలో తొమ్మిది ప్రపంచకప్ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
షకీబ్ విషయానికొస్తే.. ఈ బంగ్లాదేశీ వెటరన్ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 36 మ్యాచ్‌లు ఆడి 23.93 సగటున 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 742 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన షకీబ్ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. షకీబ్ 36 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టి, టీ20 వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్, షకీబ్‌లకు ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ కావచ్చు. రోహిత్ తొలి ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉండగా.. షకీబ్‌కు టీ20 ప్రపంచకప్ కలగా మిగిలిపోవచ్చు.
2024 ఎడిషన్ విషయానికొస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడనున్నాయి. భారత్ గ్రూప్-ఏలో పాకిస్తాన్‌తో పాటు మరో మూడు జట్లతో పోటీపడనుంది. బంగ్లాదేశ్ గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంకతో పాటు మరో రెండు చిన్న జట్లతో తలపడనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న (ఐర్లాండ్) ఆడనుండగా.. బంగ్లాదేశ్ జూన్ 7న (శ్రీలంక) తమ వరల్డ్‌కప్ క్యాంపెయిన్‌ను ప్రారంభించనుంది.