చైనా గత మూడేళ్లుగా పాకిస్తాన్‌కు రక్షణ సహకారాన్ని అందిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్తాన్‌కు రక్షణ సహాయాన్ని కల్పిస్తోంది. బంకర్‌ల నిర్మాణానికి, మానవరహిత యుద్ధ వైమానిక వాహనాల విస్తరణకు సాయం చేస్తోంది. ఇంతేకాకుండా ఎల్‌ఓసీలో రహస్య కమ్యూనికేషన్ టవర్‌ర్లను ఏర్పాటు చేయడం, భూగర్భ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేయడంలోనూ పాక్‌కు చైనా సహాయం చేస్తోంది.
చైనాకు చెందిన అధునాతన రాడార్ సిస్టమ్‌లైన ‘జేవై’, జీహెచ్‌ఆర్‌ల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎల్‌ఓసీలో ప్రయోగాలు చేస్తోంది. అలాగే పాక్ సైన్య, వైమానిక రక్షణ విభాగాలకు కీలకమైన ఇంటెలిజెన్స్ మద్దతును చైనా అందిస్తోంది. తాజాగా చైనాకు చెందిన 155 మి.మీ. హోవిట్జర్ గన్ ఎస్‌హెచ్-15 ఉనికి నియంత్రణ రేఖ వెంబడిగల వివిధ ప్రదేశాలలో కనిపించింది.
చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) సీనియర్ అధికారుల ఉనికి ప్రత్యక్షంగా కనిపించనప్పటికీ, చైనా సైనికులు, ఇంజనీర్లు భూగర్భ బంకర్‌ల నిర్మాణంతో సహా నియంత్రణ రేఖ వెంబడి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారనడానికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లిపా వ్యాలీలో చైనా నిపుణులు సొరంగం నిర్మిస్తున్నారని, ఇది కారకోరం హైవేకి అనుసంధానించే ఆల్-వెదర్ రోడ్డు నిర్మాణాన్ని సూచిస్తున్నదని కొందరు అధికారులు తెలిపారు.
కారకోరం హైవే ద్వారా పాకిస్తాన్‌లోని గ్వాదర్ ఓడరేవుతో చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్ మధ్య ప్రత్యక్ష మార్గాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసమే ప్రతిష్టాత్మక 46 బిలియన్ల డాలర్ల సీపీఈసీ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తోంది. 2007లో చైనాకు చెందిన ఒక టెలికం కంపెనీ పాక్‌కు చెందిన ఒక టెలికం కంపెనీని కొనుగోలు చేసింది. దీంతో చైనా మొబైల్ కంపెనీ పాకిస్తాన్‌లో తన సేవలను అందిస్తోంది.
చైనా ఇటీవలి కాలంలో పాక్‌కు అందిస్తున్న సహకారంపై భారత సైన్యం ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నప్పటికీ, ఈ పరిణామాలపై నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాయి. గతంలో గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలలో చైనా కార్యకలాపాలపై భారతదేశం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపధ్యంలో భారతదేశం అప్రమత్తంగా ఉందని, సరిహద్దు ఆవల నుండి ఏదైనా ముప్పు ఏర్పడితే, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత సైన్య అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment