Sakshi News home page

CWC 2023: ద్రవిడ్‌తో కలిసి పిచ్‌ పరిశీలించిన రోహిత్‌! క్యూరేటర్‌ చెప్పిందిదే!

Published Sat, Nov 18 2023 9:33 AM

CWC 2023 Final Ind vs Aus Pitch in Focus Rohit Dravid: Curator Reveals Defendable Target - Sakshi

పుష్కరకాలం తర్వాత.. అదీ సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఇరవై ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. లీగ్ దశ నుంచి ఫైనల్‌ వరకు ఓటమన్నదే ఎరుగక ముందుకు సాగిన రోహిత్‌ సేన తుదిపోరులోనూ అజేయంగా నిలవాలనే సంకల్పంతో ఉంది.

ఈ క్రమంలో ఇప్పటికే కంగారూలతో పోటీకి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషించి అందుకు తగ్గట్లుగా తమను తాము సన్నద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు శుక్రవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది.

ఈ సందర్భంగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్, ఇషాన్‌ కిషన్, ప్రసిధ్‌ కృష్ణ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే మైదానానికి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు రోహిత్‌ క్యాచింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. మరోవైపు.. జడేజా, ఇషాన్‌ నెట్స్‌లో బ్యాటింగ్‌ చేశారు.

అనంతరం.. రోహిత్‌ శర్మ ద్రవిడ్‌తో కలిసి అహ్మదాబాద్‌ పిచ్‌ను పరిశీలించాడు. బీసీసీఐ క్యూరేటర్లు ఆశిష్‌ భౌమిక్‌, తపోష్‌ ఛటర్జీ సహా స్థానిక క్యూరేటర్‌ జయేశ్‌ పటేల్‌తో చర్చించాడు. కాగా ప్రపంచకప్‌-2023 లీగ్‌ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరిగిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఇక్కడ బ్లాక్‌ సాయిల్‌(నల్ల మట్టి)తో కూడిన పిచ్‌ను రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. భారత్‌- ఆస్ట్రేలియా ఫైనల్‌కు కూడా ఇదే రకమైన పిచ్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన పిచ్‌ క్యూరేటర్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ మేరకు.. ‘‘బ్లాక్‌ సాయిల్‌ స్ట్రిప్‌ ఉన్న పిచ్‌పై హెవీ రోలర్‌ ఉపయోగిస్తే.. స్లో బ్యాటింగ్‌ ట్రాక్‌ తయారు చేసే వీలుంటుంది. ఇక్కడ 315 పరుగులన్నది కాపాడుకోగలిగిన లక్ష్యమే. లక్ష్య ఛేదన(సెకండ్‌ బ్యాటింగ్‌)కు దిగే జట్టుకు మాత్రం కష్టాలు తప్పవు’’ అని పీటీఐతో పేర్కొన్నారు.

ఇక ఐసీసీ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘ఐసీసీ పిచ్‌ కన్సల్టెంట్‌ ఆండీ అట్కిన్సన్‌ ఇండియాలోనే ఉన్నారు.  ఆయన ఇక్కడికి వచ్చారు. కానీ ‍గ్రౌండ్‌ను పరిశీలించలేదు. అయితే, శనివారం అందుబాటులో ఉంటారు’’ అని పేర్కొన్నాయి. 

Advertisement

What’s your opinion

Advertisement