టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియాలో తన స్థానం గురించి యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఐపీఎల్ మీదనే ఉందని.. గుజరాత్ టైటాన్స్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశం గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పాడు.
ఒకవేళ ఐసీసీ టోర్నీ ఆడే భారత జట్టులో తనకు చోటు దక్కకున్నా.. సహచర ఆటగాళ్లను చీర్ చేస్తూ వాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తానని గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024కు ముందే.. టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును వీడాడు.
టైటాన్స్ కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ గూటికి చేరి కెప్టెన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం శుబ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అతడి సారథ్యంలో టైటాన్స్ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.
ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక వ్యక్తిగతంగానూ శుబ్‌మన్ గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. గత సీజన్‌లో 17 ఇన్నింగ్స్ ఆడి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఈసారి 9 ఇన్నింగ్స్‌లో కలిపి 304 పరుగులు చేశాడు.
రోహిత్‌కు జోడీగా విరాట్ కోహ్లి
ఇదిలా ఉంటే.. మే 26న ఐపీఎల్-2024కు తెరపడనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మే 1 నాటికి జట్లను ఖరారు చేయాలని ఐసీసీ ఈ ఈవెంట్లో పాల్గొనే 20 దేశాల బోర్డులను ఆదేశించింది.
ఈ క్రమంలో టీమిండియా ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి బరిలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీటీఐతో మాట్లాడుతూ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
గత సీజన్‌లో దాదాపు 900 రన్స్ చేసినా.. చోటివ్వకపోతే
‘‘టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవుతానా లేదా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఐపీఎల్‌లో నా ఫ్రాంఛైజీ నన్ను నమ్మి కీలక బాధ్యతను అప్పగించింది.
ఇప్పుడు నా మొదటి ప్రాధాన్యం గుజరాత్ టైటాన్స్.. ఈ జట్టుతో ముడిపడిన ఆటగాళ్లు మాత్రమే. అదే విధంగా నా జట్టు కోసం ఓ బ్యాటర్‌గా వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని భావిస్తున్నా.
ఇక ఆటగాడిగా నేను సొంతగడ్డపై టీమిండియా ఆడిన వన్డే వరల్డ్‌కప్ నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం ఎంతటి అదృష్టమో తెలుసుకోగలిగాను.
ఫామ్‌లో ఉన్న కోహ్లి
అయితే, గత ఐపీఎల్ సీజన్‌లో దాదాపుగా 900 పరుగులు చేసిన నాకు జట్టులో చోటు దక్కకపోతే నేనేమీ చేయలేను. సహచర ఆటగాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తప్ప’’ అని శుబ్‌మన్ గిల్ వ్యాఖ్యానించాడు. కాగా విరాట్ కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులతో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.
చదవండి: Virat Kohli: చిన్న పిల్లాడిలా కోహ్లి సంబరాలు.. వాళ్లకు థాంక్స్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment