టీ20 ప్రపంచకప్-2024లో భారత ఓపెనింగ్ జోడీ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిస్థితులకు తగ్గట్లుగా తమ తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.
అదే విధంగా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తాము జట్టును ఎంపిక చేయలేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. కాగా జూన్ 1న వరల్డ్‌కప్ మొదలుకానుండగా.. టీమిండియా జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు తుదిజట్టులో చోటు దక్కదని భావిస్తున్నారు.
అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి
ఈ విషయంపై స్పందించిన రోహిత్ శర్మ..‘‘ప్రస్తుతం మాకు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
వెస్టిండీస్‌కు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితుల ఆధారంగా మా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకుంటాం. నిజానికి చాలా మంది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు.
కానీ మేము ఎప్పటి నుంచో ఈ ఫార్మాట్లో జట్టు కూర్పు గురించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. చాలా కాలం క్రితమే 15 మంది సభ్యుల జట్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నాం. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా మేము మా ప్రణాళికలు మార్చుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ ప్రదర్శన ఇలా
కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లలో కలిపి 315 పరుగులు చేశాడు.
మరోవైపు కోహ్లి ఆర్సీబీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ 10 మ్యాచ్‌లలో కలిపి 500 పరుగులు రాబట్టాడు. ఇక యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతూ 9 మ్యాచ్‌లలో కలిపి కేవలం 249 పరుగులే చేశాడు.
అయితే, ఓపెనింగ్ స్థానం కోసం జరిగిన పోటీలో జైస్వాల్ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. శుబ్‌మన్ గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
కానీ.. ఐపీఎల్-2024లో ప్రస్తుతం 509 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మాత్రం మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment