టీ20 ప్రపంచకప్-2024లో భారత తుది జట్టు కూర్పు గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని.. లేదంటే జట్టులో అతడికి స్థానం ఇవ్వటమే దండగ అని పేర్కొన్నాడు.
యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాలని.. కెప్టెన్, రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను మిడిలార్డర్‌లో ఆడించాలని హెడెన్ సూచించాడు. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ప్రాక్టీసు మొదలుపెట్టగా.. కోహ్లి మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఓపెనింగ్ జోడీ ఎవరు?
ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. యశస్వి- కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుందని ఇటీవల తన అభిప్రాయం పంచుకున్నాడు.
రోహిత్ మిడిలార్డర్‌లో రావాలి
తాజాగా ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లను వరుసగా పంపలేం. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది.
కోహ్లి యశస్వితో కలిసి ఓపెనింగ్ చేయాలి. లేదంటే అతడికి నా జట్టులో చోటే ఉండదు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఓపెనర్‌గా వస్తేనే బాగుంటుంది.
ఇక రోహిత్ శర్మ.. అతడొక విలక్షణమైన ఆటగాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఏమాత్రం సంకోచించడు. అంతర్జాతీయ టీ20లలో అతడు నాలుగో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తే బాగుంటుంది’’ అని హెడెన్ అభిప్రాయపడ్డాడు.
నాలుగో నంబర్‌లో రోహిత్ శర్మ.. గణాంకాలు ఇవీ
టీమిండియా తరఫున రోహిత్ శర్మ ఇప్పటి వరకు 151 టీ20లు ఆడి.. 3974 పరుగులు చేశాడు. ఇందులో 27 సార్లు అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 481 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.
కాగా 2022లో రోహిత్ ఎనిమిది సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి.. రెండు ఫిఫ్టీల సాయంతో 188 పరుగులు(స్ట్రైక్‌రేటు 122.87) సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 91 ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌లో వచ్చిన హిట్‌మ్యాన్.. 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 2565 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment