
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించాడు. అంతటి సచిన్ టెండుల్కరే 2007 వరల్డ్‌కప్ టోర్నీలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడని సెహ్వాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
మూడో స్థానంలో ఆడిస్తాను
‘‘నాకు గనుక అవకాశం ఉంటే.. అతడి(కోహ్లి)ని ఓపెనింగ్‌కు పంపించను. అతడిని మూడో స్థానంలో ఆడిస్తాను. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా నా ఆప్షన్. కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలి.
మిడిల్ ఓవర్లలో ఎలా ఆడాలి అనేది అతడి తలనొప్పి. ఒకవేళ ఆరంభంలోనే వికెట్ పడితే కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడు. కాబట్టి పవర్ ప్లేలో తను ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు.
ఒకవేళ వికెట్ తొందరగా పడకపోతే.. ఎలా ఆడాలో కెప్టెన్, కోచ్‌ల సూచనలకు అనుగుణంగా అతడు ఆడాలి. జట్టులో ఒక ఆటగాడిగా అతడు తప్పక ఇది చేయాల్సిందే’’ అని క్రిక్‌బజ్ షోలో అతడు వ్యాఖ్యానించాడు.
మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు
ఇందుకు ఉదాహరణగా సచిన్ టెండుల్కర్ పేరును ప్రస్తావించిన సెహ్వాగ్.. ‘‘2007 ప్రపంచకప్ టోర్నీలో సచిన్ టెండుల్కర్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేశాడు.
మిడిలార్డర్‌లో ఆడటం సచిన్‌కు అస్సలు ఇష్టం లేదు. అయినా.. జట్టు ప్రయోజనాల కోసం ఒప్పుకొన్నాడు. మీ జట్టులో ఇద్దరు మంచి ఓపెనర్లు ఉండి.. నిన్ను(కోహ్లిని ఉద్దేశించి) మూడో స్థానంలో ఆడమన్నపుడు.. కచ్చితంగా అలాగే చేయాలి.
ఓపెనర్లు సెట్ చేసిన మూమెంటమ్‌ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వన్‌డౌన్ బ్యాటర్‌కు ఉంటుంది. నాకు తెలిసి ఈ విషయంలో విరాట్ కోహ్లికి ఎలాంటి అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నా’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఓపెనర్లుగా వాళ్లే
కాగా ఈసారి పొట్టి ప్రపంచకప్ ఈవెంట్లో కోహ్లి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడిగా దిగనున్నాడని.. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ లేదంటే.. శుబ్‌మన్ గిల్‌పై వేటు పడనుందన్న వార్తల నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా జూన్ 5న వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment