కాంస్యం కోసం ధీరజ్–అంకిత ద్వయం పోరు
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ ద్వయం 155–151తో బెసెరా–మెండెజ్ (మెక్సికో) జంటను ఓడించింది.
రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత (భారత్) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో ధీరజ్ –అంకిత 0–6తో లిమ్ సిహైన్–కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ మూడో రౌండ్‌లో 4–6 తో కెన్ సాంచెజ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు.
భారత్‌కే చెందిన తరుణ్‌దీప్ రాయ్ క్వార్టర్ ఫైనల్లో 3–7తో టెమినో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లో 6–4తో జెన్ హన్‌యంగ్ (కొరియా)పై నెగ్గి సెమీఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment