హార్దిక్ పాండ్యా (PC: IPL/BCCI)
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు.
అదే విధంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్‌లో తనను తాను ప్రమోట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్‌గా, కెప్టెన్‌గానూ రాణించగలడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2024లో రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లలో ముంబై ఓడింది.
ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్ శర్మ కూడా టైటిల్ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.
‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు.
ఇక జట్టుగా ముంబై ఇండియన్స్ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు.
గతంలో కెప్టెన్‌గా ఉన్నపుడు రోహిత్ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు.
సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనను ప్రమోట్ చేసుకున్నా తప్పేం లేదు.
కానీ లోయర్ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. బౌలింగ్ కూడా చేయగలడు. కెప్టెన్‌గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment