రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా (PC: BCCI)
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నాకెందుకో అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ.. క్రికెటింగ్ కోణంలో చూస్తే.. సరికాదనే అనిపిస్తోంది.
ఇక్కడ 12 మందితో కాదు 11 మందితోనే ఆడాలి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్‌రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీమిండియాకు ఇదైతే శుభసూచకం కాదు’’- రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్.
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు నేను అనుకూలం కాదు. ఈ నిబంధన వల్ల జట్లు నిఖార్సైన బ్యాటర్లు లేదంటే బౌలర్ల సేవలనే ఉపయోగించుకుంటాయి. ఆల్‌రౌండర్లను ఎవరు పట్టించుకుంటారు?
ఇలాంటి నిబంధనలు రూపొందించే వాళ్లు కేవలం బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తుందని అనుకుంటారేమో(నవ్వులు).. ఈ రూల్ వల్ల బౌలర్లకు తిప్పలు తప్పవు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్టులో అదనపు సభ్యుడు చేరతాడు. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉంటే వాళ్లు బ్యాటర్‌ను.. బౌలింగ్ వీక్‌గా ఉంటే బౌలర్‌ను తెచ్చుకుంటారు.
అందుకే బ్యాటర్ వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలుపెడతాడు. గత రెండేళ్లుగా గమనిస్తూనే ఉన్నా.. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉంటారు కాబట్టి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తారు’’- అక్షర్ పటేల్, టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.
మొన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ఐపీఎల్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్‌రౌండర్లకు నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు.
ఏమిటీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన?
ఐపీఎల్-2023కి ముందు నిర్వాహకులు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేయడానికి జట్టులోకి వచ్చే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్. ఈ నిబంధన ప్రకారం ఇండియన్ ప్లేయర్‌ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. టాస్ సమయంలో కెప్టెన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా నలుగురి పేర్లను నామినేట్ చేయాలి. అందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవాలి.
ఎప్పుడు తెచ్చుకోవచ్చు?
ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే ఓవర్ పూర్తైన తర్వాత.. లేదంటే వికెట్ పడిన అనంతరం.. లేదా బ్యాటర్ రిటైర్ అయినపుడు కెప్టెన్ తమ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించవచ్చు.
ఒక బౌలింగ్ చేస్తున్న జట్టు ఓవర్ మధ్యలోనే(వికెట్ పడ్డా/బ్యాటర్ రిటైర్ అయినా) ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకువస్తే ఆ వ్యక్తిని మిగిలిన ఓవర్ పూర్తయ్యేదాకా బౌలింగ్ చేసేందుకు అనుమతించరు.
ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత..
ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారో.. సదరు ఆటగాడు మిగిలిన మ్యాచ్‌కు దూరమవుతాడు. కనీసం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఉండే అవకాశం కూడా ఉండదు.
ఒకవేళ విదేశీ ప్లేయర్‌ని తీసుకుంటే?
నిబంధనల ప్రకారం తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. కాబట్టి అప్పటికే జట్టులో నలుగురూ ఉన్నారంటే కచ్చితంగా ఇండియన్ ప్లేయర్‌నే ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చుకోవాలి. అయితే, టాస్ సమయంలోనే నలుగురు సబ్‌ట్యూట్‌లలో ఒకరిగా విదేశీ ప్లేయర్‌ను నామినేట్ చేయాలి.
జట్టులో ఎంతమంది?
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా జట్టులో 11 మంది కంటే ఎక్కువయ్యే అవకాశం లేదు. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్‌నే ఎక్కువగా సబ్‌ట్యూట్‌గా ఉపయోగించుకుంటారు. ఒకవేళ బౌలింగ్ టీమ్ గనుక ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలర్‌ను తీసుకువస్తే.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. లేదంటే పవర్ ప్లే లేదా డెత్ ఓవర్ల స్పెషలిస్టు సేవలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవచ్చు.
శివం దూబేకు నో ఛాన్స్! ముందే సర్దుకున్న హార్దిక్
అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్‌రౌండర్లు నష్టపోతున్నారనేది చర్చ. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెప్పినట్లు బ్యాటింగ్ టీమ్ స్పెషలిస్టు బ్యాటర్‌ను.. బౌలింగ్ టీమ్ స్పెషలిస్టు బౌలర్‌ను తెచ్చుకుంటుంది. ఒకవేళ ఆల్‌రౌండర్లకు ఛాన్స్ ఇచ్చినా వాళ్లు ఏదో ఒక సేవకే పరిమితం అవుతారు.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకుంటోంది. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండగా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీకి ముందు ఇలా జరగడం ఒక విధంగా అతడికి నష్టం చేకూరుస్తోంది.
ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం హార్దిక్ పాండ్యాతో పోటీ పడుతున్న దూబే.. బౌలింగ్ చేయనట్లయితే సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపరు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాడేమో మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టి తన ఆల్‌రౌండ్ నైపుణ్యాలను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అలా చూసుకుంటే కష్టమే
ఆల్‌రౌండర్లకు జరుగుతున్న నష్టం గురించి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగానే మారుతుంది. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఫామ్(బ్యాటింగ్/బౌలింగ్) కోల్పోయిన ఆల్‌రౌండర్‌కు జాతీయ జట్టు తరఫున ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment